ఉత్తరాఖండ్ ఎస్సీఈఆర్టీ బృందం ప్రశంస
విజయవాడ : రాష్ట్రంలో విద్యా కార్యక్రమాలు వినూత్నంగా అమలు జరుగుతున్నాయని ఉత్తరాఖండ్ ఎస్సీఈఆర్టీ జాయింట్ డైరెక్టర్ ఆశా రాణి పేర్కొన్నారు. మంగళవారం విజయవాడలోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ వివిధ అంశాలలో ఉత్తరాఖండ్ కి ఆంధ్ర ప్రదేశ్ కి సారూప్యత ఉందని తెలిపారు. రాష్ట్రంలో అమలు జరుగుతున్న అమ్మఒడి, నాడు నేడు, టోఫెల్, ఐబీ వంటి కార్యక్రమాలు ప్రభుత్వ ప్రతిష్టను పెంచుతున్నాయని ప్రశంసించారు. ఎస్సీఈఆర్టీలో ఏర్పాటు చేసిన స్టేట్ అసెస్మెంట్ సెల్ గురించి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. తమ రాష్ట్రంలో ఈ నిర్మాణాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు, దీనికి సంబంధించిన విధివిధానాలను అడిగి తెలుసుకున్నారు. ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డా. బి.ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో ఉత్తరాఖండ్ బృందానికి సాంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. అనంతరం ఆయన రాష్ట్రంలో అమలవుతున్న వివిధ విద్యా కార్యక్రమాల అమలు తీరును వివరించారు. అనంతరం విజయవాడలోని ఎంకే బిగ్ మున్సిపల్ పాఠశాలను సందర్శించి క్షేత్రస్థాయిలో జరుగుతున్న విద్యా కార్యక్రమాలను తెలుసుకున్నారు. నేడు (బుధవారం) నంద్యాల డైట్, తర్వాత విశాఖపట్నంలో కొన్ని పాఠశాలలను, డైట్ ను ఈ బృందం పరిశీలించనున్నారు. ఈ బృందంలో డాక్టర్ కే ఎన్ బిజిల్వాన్, డాక్టర్ రమేష్, హరేంద్ర అధికారి, వినయ్ అరుణ్ తదితరులు పాల్గొన్నారు.