గుంటూరు : ఏపీలో ఎన్నికల వేళ అభివృద్ధి మంత్రం వైపు పలు పార్టీ నేతలు ఆకర్షితులవుతున్నారు. గత కొన్నాళ్లుగా ప్రతిపక్షాలకు షాక్ తగిలేలా వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు కనిపిస్తున్నాయి. క్షేత్రస్థాయి కేడర్ మొదలు మాజీ మంత్రులు, కీలక నేతల దాకా అధికార పార్టీ కండువా కప్పుకుంటున్నారు. ఈక్రమంలో తాజాగా ఆళ్లగడ్డ బీజేపీ ఇంఛార్జి భూమా కిషోర్‌రెడ్డి వైఎస్సార్సీపీలో చేరారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చిన ఆయన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్డీ కండువా కప్పుకున్నారు. కిషోర్ రెడ్డితో పాటు భూమా వీరభద్రారెడ్డి, గంధం భాస్కర్‌రెడ్డి, అంబటి మహేశ్వరరెడ్డి, పలువురు స్ధానిక బీజేపీ నేతలు సైతం వైఎస్సార్సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మనందరెడ్డి, ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి (నాని), వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.