బీసీల ప్రత్యేక సమస్యలకు పరిష్కారం
రాజకీయ, ఆర్థిక, సామాజిక ప్రగతికి బాటలు
నేడు టీడీపీ‘జయహో బీసీ’ సదస్సు
బీసీ డిక్లరేషన్ మంగళవారం విడుదల
సదస్సుకు హాజరుకానున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్
డిక్లరేషన్ పై టీడీపీ, జనసేన అగ్ర నేతల సుదీర్ఘ చర్చలు
గుంటూరు : జనాభాలో సగానికి పైగా ఉండే వెనుకబడిన తరగతుల వారి సమగ్రాభివృద్ధికి నేటి తరుణంలో చేపట్టవలసిన చర్యలతో టీడీపీ -జనసేన కూటమి మంగళవారం ‘బీసీ డిక్లరేషన్’ విడుదల చేయనున్నది. దీనికోసం ‘జయహో బీసీ’ సదస్సును ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, టీడీపీ బీసీ సాధికార కమిటి ఛైర్మన్ కొల్లు రవీంద్రతో పాటు రెండు పార్టీలకు చెందిన అగ్ర నాయకులు, కార్యకర్తలు సదస్సులో పాల్గొంటారు. టీడీపీ విడుదల చేయనున్న ‘బీసీ డిక్లరేషన్’ కు సంబంధించిన వివిధ అంశాలను చర్చించేందుకు సోమవారంన టీడీపీ కేంద్ర కార్యాలయంలో యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. దాదాపు 3 గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో టీడీపీ నాయకులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, దువ్వారపు రామారావు, పంచుమర్తి అనురాధ, కాల్వ శ్రీనివాసులు, బీద రవిచంద్రయాదవ్, వీరంకి గురుమూర్తి, జనసేన నాయకులు పోతిన మహేష్, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ తో పాటు ఇతర నాయకులు, వివిధ బీసీ కులాల ప్రతినిధులు పాల్గొన్నారు.
బీసీలు టీడీపీకి వెన్నెముక : టీడీపీ ఆవిర్బావం నుంచి బీసీలు పార్టీకి బలమైన మద్దతుదారులుగా నిలబడ్డారని, వారి ఉన్నతి కోసం టీడీపీ ప్రభుత్వాలు పలు చర్యలు చేపట్టాయని, నేటి తరుణంలో బీసీల సమగ్రాభివృద్ధి కోసం చేపట్టాల్సిన నిర్దిష్ట విధానాలు, చర్యలతో ఒక సమగ్ర బీసీ డిక్లరేషన్ ను మంగళవారం చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ లు విడుదల చేస్తారని పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. విస్తృత చర్చల ఆధారంగా ఈ డిక్లరేషన్ ను రూపొందిస్తామని ఆయన అన్నారు. మంగళవారం జరగనున్న ‘జయహో బీసీ’ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
బీసీలకు న్యాయం జరగాలి : సమాజంలో బీసీల స్థానం, నేటి తరుణంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యల గురించి యనమల రామకృష్ణుడు సుదీర్ఘంగా వివరించారు. భారత రాజ్యాంగ లక్ష్యాలలో ఒకటైన ‘సామాజిక న్యాయం’ఇంకా పూర్తిస్థాయిలో వారికి అందాల్సివుందని, నేటి టెక్నాలజీ యుగంలో ఎక్కువగా చేతివృత్తులపై ఆధారపడే బీసీలు పలు సవాళ్లు ఎదుర్కొంటున్నారని, వీటికి తగు పరిష్కారాలు చూపించాలని ఆయన అన్నారు. బీసీల సమగ్రాభివృద్ధి, సామాజిక న్యాయం కోసం రాజకీయ సాధికారత, అధికారంలో భాగస్వామ్యం, ఆర్థిక పరిపుష్టి వీలైనంత త్వరలో తగు స్థాయిలో కల్పించాలని రామకృష్ణుడు అన్నారు. దేశంలో అమలులో ఉన్న ఆర్థిక విధానాలతో అసమానతలు పెరుగుతున్నాయని, దీనివలన బీసీలు ఎక్కువగా నష్టపోతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. పెరుగుతున్న ఈ అసమానతల నేపథ్యంలో బీసీల శ్రేయస్సు కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి వక్కాణించారు. వెనుకబడిన తరగతులవారి ఆర్థిక స్థితిగతులను ప్రాధాన్యతా క్రమంలో వీలైనంత త్వరలో మెరుగుపరచాలని, అప్పుడే వారు రాజకీయాల్లో మరింత క్రియాశీలకం కాగలరని రామకృష్ణుడు తెలిపారు. టెక్నాలజి విస్తరణతో సాంప్రదాయ చేతివృత్తులవారు ఉపాధి కోల్పోతున్నారని, దీనికి తగు పరిష్కార మార్గాలు కనుగొనాలని ఆయన సూచించారు.
వివరణాత్మక బీసీ డిక్లరేషన్ : పలు కులాలతో రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న వెనుకబడిన తరగతులవారి సమగ్ర ప్రగతి కోసం దారులు చూపే ‘బీసీ డిక్లరేషన్’ సుదీర్ఘంగా ఉండవచ్చని రామకృష్ణుడు తెలిపారు. వారి రాజకీయ, సామాజిక, ఆర్థిక సాధికారత కోసం రానున్న ఎన్నికల తరువాత ఏర్పడనున్న తెదేపా-జనసేన కూటమి చేపట్టే సమగ్ర చర్యల వివరాలు అందులో ఉంటాయని ఆయన తెలిపారు.
బీపీ కులగణన అత్యవసరం : 1931లో బ్రిటీష్ పాలకులు దేశంలో మొదటి జనగణనను చేపట్టినా, స్వాతంత్ర్యానంతరం బీసీల కులగణన కోసం పలు డిమాండ్లు వచ్చినా కొన్ని కారణాలతో అది జరగలేదని, ఇప్పుడు జరగాల్సిన తరుణం వచ్చిందని, ఈ అంశానికి టీడీపీ ప్రాధాన్యత ఇస్తుందని రామకృష్ణుడు అన్నారు.
బీసీలకు జగన్ రెడ్డి మోసం : వైసీపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాలనలో బీసీలు అన్ని విధాలుగా నష్టపోయారంటూ, బీసీ రిజర్వేషన్ల పట్ల జగన్ రెడ్డి వైఖరిని రామకృష్ణుడు ఎత్తిచూపారు. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ ను 24 శాతం నుండి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 34 శాతానికి పెంచగా, దాన్ని జగన్ రెడ్డి 24 శాతానికి కుదించి బీసీల రాజకీయ సాధికారతకు తూట్లు పొడిచారని రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదు అన్న నియమాన్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా సవరించేందుకు జగన్ రెడ్డి ఎట్టి చర్యలు చేపట్టలేదని ఎత్తిచూపారు.
డిక్లరేషన్ అంశాలు : రేపు విడుదల కానున్న బీసీ డిక్లరేషన్ లో కేంద్ర ప్రభుత్వ స్థాయిలో చేపట్టాల్సిన అంశాలతోపాటు రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో అమలు చేయాల్సిన నిర్ణయాలు, వివిధ బీసీ కులాలవారీగా అందించాల్సిన మద్దతుకు సంబంధించిన వివరాలుంటాయని టీడీపీ బీసీ సాధికారత కమిటి ఛైర్మన్ కొల్లు రవీంద్ర తెలిపారు. ప్రస్తుత రాజకీయ, సామాజిక, ఆర్థిక వ్యవస్థలో బీసీలు ఎదుర్కుంటన్న సమస్యలు, కులాలవారీగా ప్రజల ఆశలు, ఆకాంక్షలకు సంబంధించి విస్తృత చర్చ జరిగింది. వీటి ఆధారంగా రూపొందించబడి మంగళవారం విడుదల కానున్న ‘బీసీ డిక్లరేషన్’ రాష్ట్రంలో వెనుకబడిన తరగతులవారి సమగ్ర వికాసం దిశలో కొత్త అధ్యాయానికి తెరతీస్తుందని సదస్సులో పాల్గొన్న నేతలు విశ్వాసం వెలిబుచ్చారు