హైదరాబాద్ : త్వరలో జరుగబోయే పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు దృష్టి సారించారు. ఈ క్రమంలో భాగంగా పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. నిన్న కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజక వర్గాలకు చెందిన నేతలతో సమాలోచనలు జరిపారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు కీలక సూచనలు చేశారు. అలాగే అభ్యర్థుల ఎంపికపై నేతలతో అభిప్రాయాలను సైతం అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో సోమవారం ఖమ్మం, మహబూబాబాద్ నేతలతో బీఆర్ఎస్ అధినేత భేటీ అయ్యారు. తెలంగాణ భవన్లో రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన నేతలతో సమావేశమైన కేసీఆర్ లోక్సభ ఎన్నికల కార్యాచరణపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. సమావేశానికి రెండు పార్లమెంట్ నియోజక వర్గాలకు చెందిన నేతలతో పాటు కీలక నేతలు హాజరయ్యారు.