ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
డీఎస్సీ షెడ్యూల్‌ను సస్పెండ్ చేసిన హైకోర్టు
వెలగపూడి : ఏపీలో జరుగుతోన్న టెట్, టీఆర్టీ పరీక్షలకు సంబంధించి షెడ్యూల్‌ను మార్చాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పరీక్షల మధ్య 4 వారాల సమయం ఉండాలని, రాత పరీక్ష తర్వాత ‘కీ’పై అభ్యంతరాల స్వీకరణకూ సమయం ఇవ్వాలని సూచించింది. 2018లో జరిగిన టెట్, టీఆర్టీ మధ్య తగిన సమయం ఇచ్చారని, ఇప్పుడు మాత్రం హడావిడిగా నిర్వహిస్తున్నట్లుగా ఉందని కోర్టు అభిప్రాయపడింది.టెట్ , డీఎస్సీ పరీక్షలకు సంబంధించి ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. టెట్ , డీఎస్సీ పరీక్షల మధ్య నాలుగు వారాలు కనీస సమయం ఉండాలని హైకోర్ట్ తీర్పునిచ్చింది. మార్చ్ 15 నుంచి ఇచ్చిన డీఎస్సీ షెడ్యూల్‌ను ధర్మాసనం సస్పెండ్ చేసింది. టెట్ పరీక్ష ఫలితాలు మార్చ్ 14న వస్తున్నాయని , మార్చ్ 15 నుంచి డీఎస్సీ పరీక్షలు పెట్టడంపై హైకోర్ట్‌లో పలువురు విద్యార్థులు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై సోమవారం హైకోర్టులో విచారణకు రాగా పిటిషనర్ల తరపున న్యాయవాది జువ్వాడి శరత్ చంద్ర వాదనలు వినిపించారు. కేవలం ఒక్క రోజు సమయంలో విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవుతారని శరత్ చంద్ర ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఎప్పుడు అటువంటి షెడ్యూల్ ఇవ్వలేదని వాదించారు. నిరుద్యోగుల హక్కులను హరిస్తున్నారని న్యాయవాదలు ఆందోళన వ్యక్తం చేశారు. పిటిషనర్ల తరపున న్యాయవాదుల వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు.. మార్చ్ 15 నుంచి ఇచ్చిన డీఎస్సీ షెడ్యూల్‌ను సస్పెండ్ చేసింది. టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్షలకు నాలుగు వారాలు కనీసం సమయం ఉండాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.