డిఎంహెచ్ఓలకు కమీషనర్ జె.నివాస్ ఆదేశాలు
అమరావతి : నేషనల్ ఇమ్యునైజేషన్ డే ను పురస్కరించుకుని ఆదివారం (మార్చి 3న) రాష్ట్ర వ్యాప్తంగా ఐదేళ్ల లోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లూ చేసింది. రాష్ట్రంలో 53,35,519 మంది ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కల్ని వేయనున్నారు. ఇందుకోసం 37,465 బూత్ లను సిద్ధం చేశారు. రాష్ట్రంలో పల్స్ పోలియో నిర్వహణకు సంబంధించి వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు వెలగపూడి ఏపీ సచివాలయంలో టాస్క్ఫోర్స్ సమావేశాన్ని ఏర్పాటు చేసి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఏ ఒక్క చిన్నారీ పల్స్ పోలియో చుక్కలు వేసుకోకుండా ఉండకూడదనీ, అందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలనీ టాస్క్ఫోర్స్ ప్రత్యేక సమావేశంలో ఆయన స్పష్టం చేశారు. అనంతరం ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్ అన్ని జిల్లాల వైద్య ఆరోగ్య శాఖాధికారులకు పల్స్ పోలియో నిర్వహణపై తగు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలకు స్వయంగా వెళ్లి పల్స్ పోలియో కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు గాను అన్ని జిల్లాలకూ నోడల్ ఆఫీసర్లను నియమించారు. కమీషనర్ నివాస్ ఆదేశాలమేరకు జాయింట్ డైరెక్టర్(చైల్డ్ హెల్త్ అండ్ ఇమ్యునైజేషన్) డాక్టర్ అర్జునరావు, స్టేట్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఎల్బీహెచ్ యస్ దేవీ పల్స్ పోలియో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పల్స్ పోలియో చుక్కల పంపిణీకి గాను రాష్ట్ర వ్యాప్తంగా 37,465 బూత్ లను ఏర్పాటు చేయడంతో పాటు 1,087 ట్రాన్సిట్ బూత్ లను కూడా ఏర్పాటు చేశారు. దీనికి అదనంగా ఇంటింటి సందర్శన నిమిత్తం 74,930 టీంలను, 1,693 మొబైల్ టీంలను ఏర్పాటు చేశారు.
మొత్తం కార్యక్రమ నిర్వహణ కోసం 1,55,420 మంది వాక్సినేటర్లను, 4,116 మంది సూపర్వైజర్లను నియమించారు. లబ్దిదారుల సంఖ్య ఆధారంగా 67,76,100 డోస్ ల పల్స్ పోలియో వ్యాక్సిన్ ను అన్ని జిల్లాలకు పంపిణీ చేశారు. అదే విధంగా కార్యక్రమ ప్రచారానికి సంబంధించిన సామగ్రిని కూడా కొనుగోలు చేసి జిల్లాలకు అందజేశారు. వ్యాక్సిన్ నిర్వహణకు అవసరమైన ఐస్ బ్యాగ్ లను కూడా అందజేశారు. 3వ తేదీన బూత్ డేగా నిర్వహిస్తారు. ఆ రోజు ప్రజలందరూ ఐదేళ్ళలోపు పిల్లలను తీసుకుని పల్స్ పోలియో కేంద్రాలకు వెళ్లి వ్యాక్సిన్ వేయించుకోవాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలలో 4, 5 తేదీలలో పట్టణ ప్రాంతాలలో 6వ తేదీన మొబైల్ బృందాలు ఇంటింటి సర్వే చేపట్టి వ్యాక్సిన్ వేయించుకోని వారిని గుర్తిస్తారు. వ్యాక్సిన్ వేయించుకోని వారికి ఇంటివద్దనే పల్స్ పోలియో మందు చుక్కలను అందజేస్తారు. జిల్లాల్లో పల్స్ పోలియో చుక్కల నిర్వహణను పర్యవేక్షించేందుకు రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేశారు. నిండు జీవితానికి రెండు చుక్కలు నినాదం ద్వారా చిన్నారులకు పల్స్ పోలియో చుక్కల ప్రయోజనాన్ని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తెలియజేయాలని , ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్ ఈ సందర్భంగా పిలుపు నిచ్చారు.