టూరిజం శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామం చూసినా గ్రామ దేవతలకు, ఇంటి దేవతలకు, వన దేవతలకు కొదవలేదని, ఆయా జాతరలు పండుగల సందర్భాలలో ప్రజలు మాట్లాడే భాషకు అర్థాలు తెలియజేసే పదకోశాన్ని తెలంగాణ సాహిత్య అకాడమీ ముద్రించడం అభినందనీయమని టూరిజం శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్ అన్నారు. శనివారం రవీంద్ర భారతి లోని టూరిజం కార్యాలయంలో తెలంగాణ సాహిత్య అకాడమీ ముద్రించిన తెలంగాణ సాంస్కృతిక పదకోశం అనే పండుగలు జాతర్ల పద నిఘంటువును తెలంగాణ పర్యాటక సాంస్కృతిక శాఖల ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్ పాల్గొని ఆవిష్కరించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అవసరమయ్యే చారిత్రక ప్రాధాన్యత కలిగిన జాతర్లకు సంబంధించిన సాంస్కృతిక పద కోశాన్ని వెలువరించడం చాలా బాగుందన్నారు. ఈ గ్రంథం ప్రచురించడం ద్వారా మన సాంస్కృతిక పద సంపద రాబోయే తరానికి అందజేయడం ఎంతో ఉపయోగంగా ఉందని, గ్రామీణ ప్రాంత జాతర్లలో పలికే భాషను వ్యవహారిక భాష గానే రాసి, ఇంత మంచి గ్రంథాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చిన రచయితలను, గ్రంథ సంపాదకులను అకాడమీ కార్యదర్శి బాలాచారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో టూరిజం శాఖ సంచాలకులు కె. నిఖిల, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ బాలాచారి, డాక్టర్ రాపోలు సుదర్శన్, అకాడమీ సిబ్బంది పాల్గొన్నారు.