అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్ : ఈ సృష్టికి మూలం మహిళలని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. మహిళల ప్రగతి పైనే ఈ దేశ ప్రగతి ఆధారపడి ఉందని అన్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఎలక్ట్రిసిటి వుమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మింట్ కాంపౌండ్ ప్రాంతంలోని టిఎస్ ఎస్ పిడిసిఎల్ కార్పోరేట్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. వేదిక ప్రాంగణానికి చేరుకున్న మంత్రికి విద్యుత్ శాఖ మహిళా ఉద్యోగులు, సిబ్బంది స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రిగారు కేక్ కట్ చేసి, మహిళా ఉద్యోగులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వారితో కలిసి గ్రూప్ ఫోటో, సెల్పీలు దిగారు. రానున్న (మార్చి 8న) అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మహిళా ఉద్యోగులనుద్దేశించి మంత్రి ప్రసంగించారు. అక్కగా, చెల్లిగా, భార్యగా, తల్లిగా ఈ సమాజంలో మహిళల పాత్ర చాలా గొప్పదని మంత్రి అన్నారు. ప్రతి వ్యక్తి మహిళల పట్ల గౌరవ మర్యాదలతో వ్యవహరించాలని సూచించారు. భర్త భార్యకు సరైన గౌరవం ఇస్తేనే అతనికి సమాజంలో గౌరవం లభిస్తుందని అన్నారు. నాడు ప్రధాని రాజీవ్ గాంధీ అమలు చేసిన రిజర్వరేషన్ల వల్లనే తాను ఎంపిపి అయి, తర్వాత కాలంలో ఎమ్మెల్యే, మంత్రిగా ప్రస్థానం సాగిస్తున్నానని మంత్రి సురేఖ తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో యుపిఎ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చట్టసభల్లోనూ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తూ మహిళా సాధికారతకు నిజమైన అర్థాన్ని ఆచరణలో చూపిస్తామని మంత్రి స్పష్టం చేశారు. తన కోరికను మన్నించి తనకు ఘనంగా స్వాగతం పలికేందుకు వెచ్చించాలనుకున్న డబ్బును సామాజిక సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తున్నందుకుగాను ఎలక్ట్రిసిటి వుమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ను ఈ సందర్భంగా మంత్రిఅభినందించారు.