రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి
హైదరాబాద్ : ప్రస్తుతం జరుగుతున్నఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో అవకతవకలకు పాల్పడితే వారు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి హెచ్చరించారు. ఇంటర్ , టెన్త్ పరీక్షల నిర్వహణ, ప్రజాపాలన సేవా కేంద్రాల ఏర్పాటు పై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, ఎస్.పి లతో నేడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డీజీపీ రవీ గుప్తా, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు బుర్రా వెంకటేశం, ఎస్.ఏ.ఎం.రిజ్వి, నదీమ్ అహ్మద్ తదితర ఉన్నతాధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సి.ఎస్. శాంతి కుమారి మాట్లాడుతూ, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ తో చెలగాటం ఆడే ఏవిధమైన చర్యలను సహించేది లేదని స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లాలో ఇంటర్ పరీక్షా పేపర్ లీకేజీకై ప్రయత్నించిన పలువురు అధ్యాపకులు, సిబ్బందిని గుర్తించి వారిని అరెస్టు చేయడమే కాకుండా వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసిన విషయాన్ని ప్రస్తావించారు.
ఇంటర్ పరీక్షలలో మొదటి, రెండవ సంవత్సరాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1521 పరీక్ష కేంద్రాలలో సుమారు 9,80,000 మంది విద్యార్థులు హాజరవుతున్నారని చెప్పారు. ఈ పరీక్షా కేంద్రాల లోనికి ఉన్నతాధికారులతో సహా ఏ ఉద్యోగి కూడా సెల్ ఫోన్ లను తీసుకెళ్లడం నిషేదించినట్టు స్పష్టం చేశారు. ప్రతీ పరీక్షా కేంద్రం వద్ద గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయాలని అన్నారు. రాష్ట్రంలో అన్ని రకాల పరీక్షలను సజావుగా, పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశ్యమని, ఈ విషయంలో జిల్లా కలెక్టర్లు ప్రణాళికా బద్దంగా పనిచేయాలని సూచించారు. ప్రతీ రోజు పరీక్షల పూర్తి అయిన అనంతరం జిల్లాలోని సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించాలని, పరీక్షల నిర్వహణపై సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై వెంటనే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఇంటర్ పరీక్షల అనంతరం పదవ తరగతి పరీక్షలు ప్రారంభమవుతాయని, ఈ పరీక్షల నిర్వహణకు కూడా ఇదే విధమైన నియమ నిబంధనలు పాటించాలని తెలిపారు.