ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజనలోకి తిరిగి తెలంగాణ
హైదరాబాద్: రైతులకు దన్నుగా నిలుస్తూ సాగు రంగాన్ని బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సాగు రంగంలోని ప్రతికూలతలు తట్టుకుంటూ రైతులకు రక్షణగా నిలిచేందుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై)లో రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చేరింది. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పీఎంఎఫ్‌బీవై సీఈవో, కేంద్ర సంయుక్త కార్యదర్శి రితేష్ చౌహాన్ శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్బంగా పీఎంఎఫ్ బీవైలో 2016 నుంచి 2020 వరకు తెలంగాణ ఉన్న విషయం, ఆ తర్వాత నాటి ప్రభుత్వం దాని నుంచి ఉప సంహరించుకున్న తీరుపై చర్చ జరిగింది. పీఎంఎఫ్‌బీవైలోకి రాష్ట్ర ప్రభుత్వం తిరిగిచేరడంతో వచ్చే పంట కాలం నుంచి రైతులు ఈ పథకం నుంచి పంటల బీమా పొందనున్నారు. పీఎంఎఫ్ బీవైతో రైతులకు ప్రయోజనం కలుగుతుందని, పంటలు నష్టపోయినప్పుడు సకాలంలోనే పరిహారం అందుతుందని రితేష్ చౌహాన్ తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో రైతు కేంద్రిత విధానాల అమలుకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ముఖ్యమంత్రి కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి తదితరులు పాల్గొన్నారు.