‘జగనన్న గోరుముద్ద’లో భాగంగా ఫుడ్ ఫ్యూచర్ ఫౌండేషన్ తో అవగాహన ఒప్పందం
జగనన్న గోరుముద్దలో భాగంగా ఫుడ్ లిటరసీపై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్
‘ఫుడ్ లిటరసీ’పై అధ్యయనం, అవగాహన, శిక్షణ తదితర అంశాలపై చర్చ
పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్
విజయవాడ : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు తగిన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని, మంచి ప్రమాణాలతో రూపొందించి అందించేలా జగనన్న గోరుముద్ద కార్యక్రమాన్ని మరింత పటిష్టవంతంగా అమలు చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ అన్నారు. శుక్రవారం ఆయన కానూరులోని షామ్రాక్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఫుడ్ ఫ్యూచర్ ఫౌండేషన్ సహకారంతో నిర్వహించిన ‘‘జగనన్న గోరుముద్ద – ఫుడ్ లిటరసీ’’ రాష్ట్రస్థాయి వర్క్ షాప్ లో ప్రవీణ్ ప్రకాష్ ముఖ్యఅతిథిగా అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడుతూ.. జాతీయ విద్యా విధానం ప్రకారం ‘హెల్త్ అండ్ వెల్ నెస్ ఎడ్యుకేషన్’ ను కరిక్యులమ్ లో భాగం చేయాల్సి ఉందన్నారు. ఈ మేరకు ‘ఫుడ్ లిటరసీ’ ను ఒక సబ్జెక్టుగా ఎలా చేర్చవచ్చనే అంశంపై ఫుడ్ ఫ్యూచర్ ఫౌండేషన్ తో అవగాహన ఒప్పందం చేసుకోవడం జరిగిందన్నారు. ఎన్రోల్మెంట్ను పెంచడంతో పాటు విద్యార్థుల్లో సామర్థ్యం పెంచేందుకు ఫుడ్ లిటరసీ దోహదం చేస్తుందన్నారు. ఇందుకు ఫుడ్ ఫ్యూచర్ ఫౌండేషన్ సీఈవో పవన్ అగర్వాల్ ఎంతో సహకరించారని తెలిపారు. ఇందులో భాగంగా ప్రభుత్వ స్కూళ్లలో పాఠ్యాంశాల్లో ‘ఫుడ్ లిటరసీ’ని ఒక ప్రత్యేక అంశంగా చేర్చే అంశాన్ని అధ్యయనం చేసి ఫుడ్ ఫ్యూచర్ ఫౌండేషన్ ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుందన్నారు.
ఈ సందర్భంగా పవన్ అగర్వాల్ మాట్లాడుతూ పాఠ్యాంశాల్లో ఫుడ్ లిటరసీ అంశంపై అధ్యయనం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఫుడ్ లిటరసీ అనేది విద్యార్థులకు చాలా ముఖ్యమైందని, పౌష్టికాహారంపై వారిలో అవగాహన కల్పించడంతో పాటు సమాజంలో కీలక మార్పులు తీసుకొస్తుందన్నారు. అంతకుముందు.. ఫుడ్ లిటరసీ సాధ్యాసాధ్యాలు, విద్యార్థులకు అవగావన, ఉపాధ్యాయులకు శిక్షణ, సమన్వయం వంటి తదితర అంశాలపై ఫుడ్ ఫ్యూచర్ ఫౌండేషన్ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులతో ఇంటరాక్షన్ సెషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ శోభిక ఎస్.ఎస్, పాఠశాల విద్యాశాఖ అధికారులు, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ అధికారులు, ఆరోగ్య వైద్య , కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు, పోషకాహార నిపుణులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.