ఏపీ రైతులకే వ్యవసాయ పథకాలపై ఎక్కువ అవగాహన
ఫలించిన రైతు భరోసా కేంద్రాల అమలు ఉద్దేశం
నాబార్డ్ సర్వేలో వెల్లడయిందన్న ఎంపీ విజయసాయి రెడ్డి
విజయవాడ : వ్యవసాయంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, వ్యవసాయ సంబంధిత పథకాలపై దేశంలో కెల్లా ఆంధ్రప్రదేశ్ రైతులకే ఎక్కువ అవగాహన ఉందని ఈ మేరకు నాబార్డ్ నిర్వహించిన సర్వేలో వెల్లడయ్యిందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో వినూత్న సంస్కరణలు చేపట్టి రైతులకు సంబందించిన సేవలన్నీ ఒకే చోట అందించే లక్ష్యంతో జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు ఈ మేరకు సత్ఫలితాలనిచ్చాయని అన్నారు. వ్యవసాయానికి సంబందించి పథకాలపై రైతులకు సమగ్ర అవగాహన కల్పిస్తూ దరఖాస్తు నుంచి అమలు వరకు రైతు భరోసా కేంద్రాలు అన్నదాతలకు అన్ని విధాలా సహాయ పడుతున్నాయన్నారు.
జగనన్న విద్యాదీవెన కింద రూ. 708.68 కోట్లు జమ : జగనన్న విద్యాదీవెన కింద సీఎం జగన్ రాష్ట్రంలో 944466 మంది విద్యార్దులకు సంబంధించి రూ.708.68 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. 2023 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యాదీవెన సాయం శుక్రవారం పామర్రులో నిర్వహించిన సభలో బటన్ నొక్కి విడుదల చేసినట్లు తెలిపారు. దీంతో విద్యార్థుల ఫీజు కష్టాలు తొలగిపోయాయన్నారు.
జగన్ ప్రభుత్వంలో ప్రజలు ఆర్థిక, సామాజిక పురోగతి : జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలు ఆర్థిక, సామాజిక పురోగతి సాధించించారని విజయసాయి రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రజల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలనిచ్చాయని అన్నారు. విభిన్న ఆదాయ మార్గాలు సృష్టించడం ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల సరాసరి ఆదాయం 50 శాతం పెంచారని అన్నారు. ప్రభుత్వం పాఠశాలల్లో నాడు నేడు కింద మౌలిక వసతులు కల్పించి, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ప్రపంచ స్థాయి ఐబీ సిలబస్ అందుబాటులోకి తెచ్చారని అన్నారు. అలాగే నాడు-నేడు కింద ప్రభుత్వ ఆసుపత్రులు అభివృద్ధి చేయడంతో పాటు ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షల వరకు పెంచి ఖరీదైన వైద్యం నిరుపేదలకు అందేలా చేశారని విజయసాయి రెడ్డి అన్నారు.
జగనన్న ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం : హోంమంత్రి తానేటి వనిత
దేవరపల్లి : రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వంగా పనిచేస్తుందని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. రైతులందరూ సంతోషంగా ఉండాలి, వ్యవసాయం అంటే పండగలా చేసుకోవాలని అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలను జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారన్నారు. దేవరపల్లి మండలం గౌరీపట్నం గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని శుక్రవారం హోం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ విత్తనం దగ్గర నుంచి పంట విక్రయం వరకూ అన్ని వేళలా రైతులకు జగనన్న ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో విస్తారంగా పండిన ధాన్యాన్ని మంచి గిట్టుబాటు ధరతో ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. నవరత్నాలలో భాగంగా రైతు భరోసా సాయం కింద దేశంలో ఎక్కడా లేనివిధంగా కౌలు రైతులకు సైతం సంవత్సరానికి రూ.13,500 చొప్పున అందిస్తున్నామన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అండగా ఉంటుందని హోంమంత్రి తానేటి వనిత తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.