రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా. చిన్నారెడ్డి
హైదరాబాద్ : మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్ లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 1509 దరఖాస్తులు అందాయి. అందులో రెవెన్యూ పరమైన సమస్యలకు సంబందించి 275 దరఖాస్తులు, రేషన్ కార్డుల కొరకు 107, ఇందిరమ్మ ఇండ్ల కోసం 396 దరఖాస్తులు ఉన్నాయి. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా. చిన్నారెడ్డి, ప్రజావాణి ప్రత్యేక అధికారి, సిడియంఎ దివ్య, ఇతర అధికారులు ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులు స్వీకరించారు. కేవలం వ్యక్తిగత దరఖాస్తులే కాకుండా వివిధ ఉద్యోగ సంఘాల నుండి కూడా దరఖాస్తులు అందుతున్నాయి. అందులో ముఖ్యంగా డిఎస్ సి 2008 బిఇడి మెరిట్ అభ్యర్ధుల సంఘం నాయకులు శుక్రవారం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డిని కలిసి తమ సమస్యను వివరించారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మధ్యంతర తీర్పు అమలు చేసి డిఎస్ సి 2008 నోటిఫికేషన్ ప్రకారం కామన్ మెరిట్ లో సెలక్ట్ అయ్యి నష్టపోయిన తమకు న్యాయం చేయాలని కోరారు. వారి సమస్యను విని సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి సంబందిత అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో ఉన్న దివ్యాంగ విద్యార్ధులకు బోదన చేస్తున్న కాంట్రాక్ట్ టీచర్ల సంఘం ప్రతినిధులు కూడా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డికి తమ సమస్యలను విన్నవించుకున్నారు.
గత 20 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠాశాలలో దివ్యాంగ విద్యార్ధులకు విద్యాభోదన చేస్తున్న తమ పోస్టులను క్రమబద్దీకరించి న్యాయం చేయాలని కోరారు. అధిక సంఖ్యలో విజ్ఞాపనలు వస్తున్నందున వాటిని పరిష్కరించడానికి సత్వర చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి తెలిపారు. ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించడానికి ప్రజాభవన్ లో ఏర్పాటు చేసిన 16 కౌంటర్ల పనితీరును, స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత శాఖలకు పంపిస్తున్న అంశాన్ని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి పరిశీలించారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా సామాన్య ప్రజల నుండి అందే ఫిర్యాదులను పరిష్కరించడానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా. చిన్నా రెడ్డి తెలిపారు.