మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం
శరద్ పవార్ సొంత పట్టణం బారామతికి వస్తున్న షిండే, ఫడ్నవీస్, అజిత్ పవార్
నమో మహా రోజ్ గార్ పథకానికి ప్రారంభోత్సవం
కార్యక్రమం ముగిశాక భోజనానికి మా ఇంటికి రండి అంటూ శరద్ పవార్ ఆహ్వానం
ముంబాయి : మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ లను ఎన్సీపీ (ఎస్ సీపీ) అధినేత శరద్ పవార్ విందుకు ఆహ్వానించారు. ఇటీవలే ఎన్సీపీ నుంచి విడిపోయి తమదే అసలైన ఎన్సీపీ అని ఈసీ ఎదుట నిరూపించుకున్న అజిత్ పవార్ ను కూడా శరద్ పవార్ విందుకు ఆహ్వానించారు. సీఎం షిండే, ఫడ్నవీస్, అజిత్ పవార్ పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం కోసం శనివారం బారామతి రానున్నారు. బారామతి శరద్ పవార్ సొంత పట్టణం. ఈ నేపథ్యంలో శరద్ పవార్ స్పందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించాక ఏక్ నాథ్ షిండే తొలిసారి బారామతి వస్తున్నారు. బారామతిలో ఆయన నమో మహా రోజ్ గార్ పథకం ప్రారంభిస్తుండడం పట్ల చాలా సంతోషంగా ఉంది. ఆ కార్యక్రమం ముగిశాక ఆయన తన కేబినెట్ సహచరులతో కలిసి మా ఇంట్లో భోజనానికి రావాలని ఆహ్వానించానని వివరించారు. లోక్ సభ ఎన్నికల్లో బారామతి నుంచి అజిత్ పవార్ తన అర్ధాంగిని శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలేపై పోటీకి నిలుపుతున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.