మూడో త్రైమాసికంలో 8.4 శాతం జీడీపీ నమోదు
గతేడాది ఇదే త్రైమాసికంలో 4.3 శాతం జీడీపీ నమోదు
అంచనాలను మించిపోయిన తాజా జీడీపీ
న్యూఢిల్లీ : మూడో త్రైమాసికంలో దేశ జాతీయ స్థూల ఉత్పాదకత (జీడీపీ) రేటు 8.4 శాతంగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో భారత్ జీడీపీ 4.3 శాతం మాత్రమే. అప్పటి వృద్ధి రేటును అనుసరించి భారత్ 2024 నాటికి 6.6 శాతం జీడీపీ నమోదు చేస్తుందని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. ఇప్పుడా అంచనాలను మించి దేశ జీడీపీ 8.4 శాతంగా నమోదైంది. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. భారతదేశ ఆర్ధిక వ్యవస్థ సత్తా ఏమిటో ఈ జీడీపీ డేటా చూస్తేనే అర్థమవుతుందని మోడీ స్పష్టం చేశారు. ఆ గణాంకాలు భారత ఆర్థిక శక్తిసామర్థ్యాలను చాటుతున్నాయని వివరించారు. సత్వర ఆర్థికాభివృద్ధి కోసం తమ ప్రయత్నాలు కొనసాగుతాయని, 140 కోట్ల మంది భారతీయులు మెరుగైన జీవనం గడిపేలా వికసిత్ భారత్ సృష్టి మన ఆర్థిక వ్యవస్థ దోహదపడుతుందని వివరించారు. ఈ మేరకు మోదీ ట్వీట్ చేశారు. తయారీ రంగం, గనులు, తవ్వకాలు, నిర్మాణ రంగాలు ఊపుమీదుండడం మూడో త్రైమాసికంలో అధిక జీడీపీ నమోదుకు కారణమైంది.