అవును వాళ్లిద్దరి మధ్య సమన్వయం ఉంది
కేడర్‌ది మాత్రం ఎవరి దారి వారిదే
చంద్రబాబు తలపై కాలు మోపి పాతాళానికి తొక్కేసెలా పవన్ వ్యాఖ్యలు
ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ
విజయవాడ : పద్నాలుగేళ్ల తమ పాలనలో ప్రజలకు మంచి చేశామని ఓటు అడిగే దమ్ము, దైర్యం చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు ఉందా అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సవాల్ విసిరారు. గడచిన నాలుగేళ్ల 10 నెలల్లో మీ కుటుంబానికి మేలు జరిందనుకుంటేనే వైయస్ఆర్సీపీకి ఓటు వేయమని అడిగే దమ్మున్న ఏకైక సీఏం జగన్ అని పేర్కొన్నారు. గురువారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. తాడేపల్లిగూడెంలో నిన్న జరిగిన టీడీపీ, జనసేన జెండా సభ అట్టర్ ప్లాప్ అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల మధ్య మాత్రమే సమన్వయం ఉందని, ఆ రెండు పార్టీల కేడర్ మాత్రం ఎవరి దారి వారిదేగా ఉందని స్పష్టమవుతుందన్నారు. జెండా సభలో వామనావతారం ప్రస్తావన తీసుకురావడం చూస్తుంటే చంద్రబాబు నెత్తిమీద పవన్ తన మూడో కాలు పెట్టి పాతాళానికి తోక్కేసెలా ఉందని ఎద్దేవా చేశారు. ఆరు లక్షల మంది వస్తారని ఏర్పాట్లు చేసుకున్న జెండా సభకు సుమారు ముప్పై వేల మంది రావటం చూస్తుంటే చంద్రబాబు, పవన్‌ల మీద ప్రజలకు ఉన్న ఆదరణ ఏమిటో అర్థమైపోతుందన్నారు. ముఖ్యంగా చంద్రబాబుని ఆకాశానికి ఎత్తేస్తూ పవన్ చేసిన వ్యాఖ్యలను విన్న కాపు సామాజిక వర్గ ప్రజలు తల కొట్టేసింట్లయ్యిందన్నారు. వంగవీటి రంగాను హత్య చేయించిన దగ్గర నుంచి ముద్రగడ పద్మనాభం కుటుంబానికి చేసిన ద్రోహం వరకు కాపులు మరిచిపోలేదు అన్నారు. అటువంటి చంద్రబాబుని ధీరోదాత్తుడుగా అభివర్ణిస్తూ పవన్ మాట్లాడటం కాపులు గుండెలు మండేలా చేశాయన్నారు. అవినీతి అనకొండ అని గూగుల్‌లో కొడితే చంద్రబాబు పేరు వస్తుంది. అటువంటి వ్యక్తిపై ఆధారపడాలి ఉండాలని పవన్ చెబుతుంటే జనసైనికులు బాధ పడ్డారని పేర్కొన్నారు. చంద్రబాబు పాలన చూసి ఓటు వేయమని అడిగే దమ్ము ఉందా అంటూ పవన్‌కు సవాల్ విసిరారు మంత్రి కొట్టు. తనని ఎవరు ప్రశ్నించకూడదు, ఎవరు సలహా ఇవ్వకూడదు అంటూ హెచ్చరించిన పవన్ కళ్యాణ్ జనసెన నాయకుల పట్ల మార్షల్‌లా వ్యవహరించాడని అన్నారు. దేశం యావత్తు ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా సీఎం జగన్ పాలన ఉందన్నారు. అందుకే రాష్ట్ర ప్రజలు ఆయన్నే మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.