గోపాలపురం : రాష్ట్ర ప్రభుత్వం జనరంజక పాలన అందిస్తోందని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జగనన్న సుపరిపాలన అందిస్తున్నారని రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం వేళ్లచింతలగూడెం వాసులకు ఆదివారం హోంమంత్రి ఇళ్ల పట్టాలను అందజేశారు. 144 కుటుంబాలకు పట్టాలు పంపిణీ చేశారు. అర్హులై ఉన్న ఎవరైనా మిగిలి ఉన్నా అందరికీ పంపిణీ చేస్తామని, ఇది నిరంతర ప్రక్రియ అని హోంమంత్రి తెలిపారు. ఈ సందర్భంగా తానేటి వనిత మాట్లాడుతూ రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతుందని, జగనన్న కాలనీల నిర్మాణంతో ఊళ్లకు ఊళ్లు ఏర్పడుతున్నాయన్నారు. ఇళ్లు లేని పేదలు ఎవరూ ఉండకూడదని ఇప్పటికే 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామన్నారు. జగనన్న ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 25 లక్షల మందికి ఇళ్లు ఇస్తామని చెప్పినప్పటికీ మ్యానిఫెస్టోలో చెప్పిన దానికంటే మిన్నగా అమలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.