ఎలా అయ్యిందో ఆత్మ పరిశీలన చేసుకోవాలి
అసెంబ్లీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
కాళేశ్వరం మేడిగడ్డ ఒకనాడు ఒక దేవాలయం అన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, నేడు అదే దేవాలయాన్ని ఒక బొందల గడ్డగా అభివర్ణించడం విచారకరమని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.. మేడిగడ్డ బొందల గడ్డగా ఎలా అయ్యిందో ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు. మేడిగడ్డ దేవాలయం అప్పుడే బొందలగడ్డ ఎందుకు అయ్యిందో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.
నీటిపారుదల శాఖపై శ్వేత పత్రం విడుదల సందర్భంగా శాసనసభలో జరినిన చర్చలో మంత్రి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొని మాట్లాడుతూ. ప్రతిపక్ష నేత కేసిఆర్ శాసనసభకు వచ్చి ఉంటే బాగుండేది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం నుంచి ముగింపు వరకు ఆయనే ఉన్నారు. కాళేశ్వరం శిల్పాన్ని చెక్కిన కేసీఆర్ ఈ రోజు శాసనసభలో ఉండి ఉంటే భీటలు వారిన పిల్లర్లకు, శిల్పానికి సొల్యూషన్ ఇచ్చేవారేమో. అందుకే కేసీఆర్ సభలో ఉండాలని కోరుకున్నాం. కాని ఆయన సభలో రాకపోవడం దురదృష్టకరం, విచారకరం. సభకు వచ్చి ఎందుకు వివరణ ఇవ్వడం లేదని దుయ్యబట్టారు.
కాళేశ్వరం అంటే బ్యారేజీలు, రిజర్వాయర్లు, సబ్స్టేషన్లు, పంప్ హౌస్‌లు, కిలోమీటర్ల సొరంగాలు అని చెప్పేవాళ్లకు ఒకటే చెప్పదలుచుకున్నాం. కాళేశ్వరం అనే సమహారానికి బేస్ ఎక్కడ అని ఒకసారి ఆలోచించుకోండి. ఈ ప్రాజెక్టుకు పునాది మేడిగడ్డ అనే విషయాన్ని గుర్తించుకోవాలి. మేడిగడ్డలో పిల్లర్లు కుంగిపోయాయి. దీని తర్వాత అన్నారం బ్యారేజీలో బుడగలు వస్తున్నాయి. ఆ తర్వాత ఉన్న సుందిళ్ల బ్యారేజీలో సిపేజ్ మొదలైంది. పరిస్థితి ఇలా ఉంటే ప్రభుత్వం నీళ్లు ఇవ్వడం లేదని మా మీద నిందలు మోపుతున్నారు. నేను ఉంటే గోదావరి నుంచి నీళ్లు ఎత్తిపోసి ఇచ్చేవాడినని ఈ ప్రభుత్వానికి చేత కావడం లేదని నల్గొండ సభలో ప్రతిపక్ష నేత కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదం. అక్టోబర్ 21న మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయాయి. అప్పటినుంచి డిసెంబర్ ఆరవ తేదీ వరకు కేసీఆర్ అపధర్మ ముఖ్యమంత్రిగా 46 రోజులపాటు ఉన్నారు. ఈ 46 రోజుల్లో ఆయన ఎన్ని నీళ్లు ఎత్తిపోసి రిజర్వాయర్లు నింపారో చెప్పాలి. అప్పుడు ఎందుకు నీళ్లు ఎత్తిపోయలేదు అని ప్రశ్నించారు. 2017లో కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో జరిగిన ఇరిగేషన్ సమావేశంలోనే అవినీతికి బీజం పడిరది ఈ సమావేశంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు కూడా పాల్గొన్నారు. ప్రాజెక్టు స్వరూపాన్ని మార్చివేసి ఇష్టానుసారంగా అంచనాలు పెంచారు. కాళేశ్వరానికి సంబంధించి రెండు చోట్ల రిజర్వాయర్లు కట్టారు కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిర్మించిన సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి ఒక రిజర్వాయర్‌ను కూడా ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. ఉమ్మడి పాలనలో తెలంగాణకు అన్యాయం జరిగిందనే ప్రత్యేక తెలంగాణను తెచ్చుకున్నాం. ఇప్పుడు కూడా ఉమ్మడి పాలన గురించి మాట్లాడడం సరికాదు. కొత్త ప్రభుత్వంలో మమ్మల్ని విమర్శించడానికి మీకు ఒక అంశం కూడా లేదు. ఆత్రుతగా ప్రాజెక్టు కట్టకుండా నాణ్యంగా కట్టివుంటే లక్ష కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయ్యేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. కళ్ల ముందే భారీ నష్టం కన్పిస్తుంటే కూడా బీఆర్ఎస్ నేతలు తప్పు ఒప్పుకోవట్లేదని విమర్సించారు.
కుంగిన మేడిగడ్డ పిల్లర్లపై ఏం చేయాలనే దానిపై మేము మీ మాదిరిగా హడావుడిగా ఆత్రుత పడదలచుకోలేదు. చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్నాము మీ మాదిరిగా నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ప్రజలకు నష్టం చేయబోము అని అన్నారు.