పదేళ్ళుగా పెండింగ్లో ఉన్నఐసిడిఎస్,ఎండియం కమీషన్ రూ.23కోట్ల 71 లక్షలు విడుదల
కరోనా సమయంలో చనిపోయిన 53 మంది రేషన్ డీలర్లకు త్వరలో పరిహారం
కేరళ తరహాలో త్వరలో రేషన్ డీలర్ల సంక్షేమ నిధి ఏర్పాటుకు చర్యలు
రేషన్ డీలర్ల కమీషన్ పెంచే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది
రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేసినా లేక అక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు
ఈఐదేళ్ళలో రేషన్ పంపిణీకి ప్రభుత్వం 12వేల 438 కోట్ల రూ.లు వెచ్చించింది
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు
వెలగపూడి : రాష్ట్రంలో గత పదేళ్ళుగా పెండింగ్ లో ఉన్న ఐసిడిఎస్, ఎండియం కమీషన్ 23కోట్ల 71 లక్షల రూ.లను రాష్ట్ర ఫౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విడుదల చేశారు. ఈమేరకు గురువారం వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈనిధులకు సంబంధించిన చెక్కును విడుదల చేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా అమలు చేసేందుకు అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగిందన్నారు. ముఖ్యంగా ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు డోర్ డెలివరీ వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 9260 మంది నిరుద్యోగులను ఎండియు ఆపరేటర్లుగా నియమించి వారికి 90 శాతం సబ్సిడీతో 9260 ఎండియు వాహనాలను సమకూర్చి వారికి నెలకు 18 వేల రూపాయలు వంతున చెల్లించడం జరుగుతోందని పేర్కొన్నారు. ఈఆపరేటర్ల ద్వారా నిత్యావసర సరుకులు కార్డుదారుల ఇంటి వద్దనే పంపిణీ చేస్తున్నప్పటికీ చౌకధరల దుకాణదారుల శ్రేయస్సు దృష్ట్యా వారిపై ప్రభుత్వానికి ఉన్నటువంటి సానుకూల ధోరణి వల్ల వారిని స్టాకిస్టులుగా కొనసాగించడం జరుగుతోందని మంత్రి నాగేశ్వర రావు స్పష్టం చేశారు. గతంలో నాణ్యతలేని రేషన్ సరుకులను ప్రజలకు పంపిణీ చేసే వారని కాని నేడు ఈప్రభుత్వం పూర్తి నాణ్యతతో కూడిన సరుకులను అందించడం జరుగుతోందని మంత్రి తెలిపారు. రాష్ట్రమంతటా సార్టెక్స్ బియ్యాన్ని పంపిణీ చేయడంతో పాటు రైతుల నుండి నేరుగా కొనుగోలు చేసి కంది పప్పును పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. రాయలసీమ ప్రాంతంలో రాగులు ఇస్తుండగా ఉత్తరాంధ్రలో రాగి పిండిని పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. త్వరలో రాష్ట్ర మంతటా వీటిని పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ రీసైక్లింగ్ చేసినా లేదా రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాలకు పాల్పడినా అలాంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యల తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు.
రాష్ట్రంలో రేషన్ సరుకుల పంపిణీకై ఈఐదేళ్ళలో ప్రభుత్వం 12వేల 438 కోట్ల రూ.లను వెచ్చించడం జరిగిందని ఫౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పష్టం చేశారు. కేవలం 1950 కోట్లు మాత్రమే ప్రభుత్వం కేటాయించదని మీడియాలో వచ్చిన వార్త వాస్తవం కాదని ఆయన ఖండించారు. 2012 నుండి పెండింగ్ లో వున్ ఐసిడిఎస్, ఎండియం కమీషను 25 కోట్ల రూ.లకు గాను ఇప్పటికే 2కోట్ల రూ.లు చెల్లించగా మిగతా 23 కోట్ల 71 లక్షల రూ.లను కూడా విడుదల చేశామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చౌకధరల దుకాణాల కమీషను కింద మార్చి 2022 వరుకు కిలోకి 70 పైసలు,ఏప్రిల్ 2022 నుండి కిలోకి 90 పైసలు ఇస్తుండగా మన ప్రభుత్వం కిలోకి రూపాయి వంతున ఇస్తోందని పేర్కొన్నారు. రేషన్ డీలర్లు కమీషన్ పెంచాలని విజ్ణప్తి చేశారని పెంపుదల గురించి చర్చించి త్వరలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని మంత్రి నాగేశ్వరరావు స్పష్టం చేశారు. కరోనా సమయములో చనిపోయిన 53 మంది చౌకధరల దుకాణదారులకు 50 వేల రూ.లు వంతున పరిహారంగా చెల్లించేందుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారని, త్వరలో ఆ పరిహారం చెల్లిండం జరుగుతుందని మంత్రి నాగేశ్వరరావు వెల్లడించారు.
గతంలో చౌకధరల దుకాణ ఆథరైజేషన్ రెన్యువల్ కై సంబంధిత రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయానికి స్వయంగా వెళ్ళి ఈప్రక్రియ పూర్తి చేసుకోవాల్సి వచ్చేదని ఈ ప్రక్రియను సులభతరం చేసేందుకై ఇకపై ఆన్లైన్ ద్వారా చేసే విధముగా సంబంధిత సచివాలయంలో ఎపి సేవా పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించడ మైనదని స్పష్టం చేశారు. చౌకధరల దుకాణ ఆథరైజేషన్ రెన్యువల్ పత్రమును కూడా సంబంధిత సచివాలయం నుండే పొందవచ్చని చెప్పారు. రేషన్ డీలర్ల శ్రేయస్సును సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కేరళ రాష్ట్రం తరహాలో చౌకధరల దుకాణ డీలర్ల సంక్షేమ నిధి ఏర్పాటుకై కమిటిని ఏర్పాటు చేశామని మంత్రి వివరించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే డీలర్లతో కమిటీ సమావేశం ఏర్పాటు చేసి ప్రతి డీలర్ నుండి ఏడాదికి 1000 రూపాయలు సంక్షేమ నిధి కోసం సేకరించాలని నిర్ణయించడమైనదని తెలిపారు. ఇందుకుగాను రేషన్ డీలర్ల సంఘం నుంచి ఆమోదం వచ్చిన తరువాత తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. 2021 లో రేషన్ డీలర్ల నుండి తీసుకొన్నఖాళీ గొనె సంచులు ఒక్కింటికి రూ. 20 ఇచ్చే అంశం ప్రస్తుతం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో ఉన్నందున కోర్టు ఆదేశాల అనంతరం తదుపరి చర్యలు తీసుకోవడం జరుగు తుందని మంత్రి పేర్కొన్నారు.డీలర్లకు సంబంధించిన ఇతర సమస్యలపై కూడా ప్రభుత్వం త్వరలో సానుకూల నిర్ణయం తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం రేషన్ డీలర్ల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని మంత్రి స్పష్టం చేశారు.రాష్ట్రంలోని రేషన్ డీలర్లందరూ భవిష్యత్తులో కూడా వారు అందిస్తున్న సహకారాన్ని కొనసాగించాలని తద్వారా దేశంలో మన రాష్ట్రం ప్రజా పంపిణీ వ్యవస్థ అగ్రస్థానంలో ఉండేలా సహకరించాలని మంత్రి నాగేశ్వరరావు విజ్ణప్తి చేశారు. ఈసమావేశంలో రాష్ట్ర ఫౌరసరఫరాల శాఖ కమీషనర్ హెచ్.అరుణ్ కుమార్, పౌర సరఫరాల సంస్థ ఎండి వీరపాండ్యన్,ఆసంస్ధ డైరెక్టర్ సునీత, పలువురు రేషన్ డీలర్లు పాల్గొన్నారు.