ప్రధాని మోడీకి అఖిలపక్ష పోరాట కమిటీ లేఖ
విశాఖ ఉక్కును ప్రయివేటు పరంచేయద్దని ఢిల్లీలో దీక్ష
ఆర్.ఐ.ఎన్.ఎల్. ని సెయిల్ తో తిరిగి అనుసంధానించాలి
విజయవాడ : విశాఖ ఉక్కు పరిరక్షణకు ఢిల్లీలో జైభారత్ నేషనల్ పార్టీ గళమెత్తింది. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసింది. ఈ విషయాన్నిజేడీ లక్ష్మీ నారాయణ గురువారం మీడియాకు తెలియజేశారు. విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, స్టీల్ ప్లాంట్ కు సొంత గనులను కేటాయించాలని పోరాట కమిటీ ప్రధాని మోడీని కోరింది. ఆర్.ఐ.ఎన్.ఎల్. ని సెయిల్ తో తిరిగి అనుసంధానించాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఆర్.ఐ.ఎన్.ఎల్. గనులు కేటాయించాలని డిమాండు చేసింది. రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) ని వ్యూహాత్మకంగా అమ్మేయాలని ఎకనమిక్ ఎఫైర్స్ కేబినేట్ కమిటీ 2021, జనవరి 27న తీసుకున్న నిర్ణయాన్నివిశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అని, ఉక్కు ఉద్యమంలో 32 మంది ప్రాణ త్యాగం చేశారని ఆయన గుర్తు చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం 66 గ్రామాలకు చెందిన 16,500 మంది రైతులు 20 వేల ఎకరాల పంట పొలాలను అందించారని తెలిపారు. అప్పట్లో కేంద్రం కేవలం 5 వేల కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టిందని, ఇపుడు విశాఖ ప్లాంట్ విలువ 3 లక్షల కోట్లకు పైగా ఉందని వివరించారు. మొదట్లో 3.2 ఎం.పి.టి.ఎ. ఉత్పత్తితో ఆరంభమై, ఇపుడు 7.3 ఎం.పి.టి.ఎ.కి స్థాయి ఎదిగిందని తెలిపారు. స్టీల్ ప్లాంట్ 55 వేల కోట్ల రూపాయలు ఇప్పటికే డివిడెండ్లు, ట్యాక్స్ ల రూపంలో ఆర్.ఐ.ఎన్.ఎల్ కు అందించిందన్నారు. దేశంలోని అన్ని ఉక్కు కర్మాగారాలకు కేపిటేటివ్ మైన్స్ ఉన్నా, సెయిల్ కి మాత్రం ఆ సౌలభ్యం లేకపోవడంతో విశాఖ ఉక్కు పరిశ్రమ మనుగడకు దెబ్బతగులుతోందన్నారు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ నిలిపివేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రధానికి నివేదించింది. ఈ లేఖపై జైభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వి.వి లక్ష్మీ నారాయణతో పాటు, విశాఖ వైఎస్.ఆర్.సిపి. ఎంపీ ఎం.వి.వి సత్యన్నారాయణ, సిపిఐ కేంద్ర నాయకులు డి.రాజా, సిపిఐఎం కేంద్ర నాయకులు సీతారాం ఏచూరి, ఆంధ్ర మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, ఐ.ఎన్.టి.యు.సి. జాతీయ కార్యదర్శి రఫీక్, ఆప్ ఆంధ్రప్రదేశ్ ఇన్ చార్జి ఆర్ మణినాయుడు, ఎ.ఐ.సి.సి. ఎస్సీ నాయకుడు రాజేష్ సంతకాలు చేశారు.