రాష్ట్ర మహాసభ కౌన్సిల్ అవగాహన సదస్సులో డాక్టర్ వి. బ్రహ్మ రెడ్డి
విజయవాడ : గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీ వైద్యుల వైద్యం చాలా అవసరమని డాక్టర్ వి. బ్రహ్మ రెడ్డి అన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం తాడిగడపలో ఆంధ్రప్రదేశ్ సామాజిక వైద్య సహాయకుల సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో మంగళవారం వార్షికోత్సవ రాష్ట్ర మహాసభ కౌన్సిల్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వి. బ్రహ్మ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ ఎం పీ డాక్టర్ల వైద్యం చాలా అవసరమన్నారు. 2007-2008లో ప్రజలకు వైద్యం అందించాలి అంటే ఏం చేయాలి, జబ్బులు వస్తే కూడా తక్కువ ఖర్చుతో ఎలా నయం చెయ్యాలని 230 వీడియోలు చేసి శిక్షణ ఇచ్చామన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి చొరవతో ఒక సంవత్సరం పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్ఎంపీ డాక్టర్లు శిక్షణ పొందాలని నిర్ణయించారని, ఆరు నెలలు శిక్షణ పూర్తవగానే రాజశేఖర్ రెడ్డి మరణంతో శిక్షణ ఆగిపోవడం జరిగిందన్నారు. ఆర్ఎంపి డాక్టర్లు ఏ స్థాయి వైద్యం చేయొచ్చు, ఏది చేయకూడదనేది ఈ శిక్షణ ద్వారా వాళ్లకు నేర్పించామన్నారు. ప్రైవేట్ డాక్టర్లు గాని, ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాలు కానీ ఈ రకమైన శిక్షణ అయితే ఉపయోగకరమన్నారు. మేము ప్రభుత్వానికి కోరుకునేది ఏంటంటే శిక్షణ అందరికి పూర్తి చేసి సర్టిఫికెట్లు ఇవ్వాలి. ఈ వైద్యం ఆర్ఎంపీ డాక్టర్లు వైద్యం చేయొచ్చని నిర్ణయించి సర్టిఫికెట్ ఇవ్వాలని కోరుతున్నామన్నారు. ఆ సర్టిఫికెట్ ఇస్తే ధైర్యంగా వైద్యం చేస్తారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో 60,000 మంది, తెలంగాణలో 40 వేల మంది మొత్తం సుమారుగా లక్ష మంది ఆర్ఎంపీ డాక్టర్లు గ్రామీణ వైద్యం చేస్తున్నారని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు వైద్యం అందుతుందన్నారు. మీరు ఈ సర్టిఫికెట్లు ఇస్తే మీరు కోరుకున్న ప్రతి పల్లెకు తక్కువ ఖర్చుతో వైద్యులు ధైర్యంగా ట్రీట్మెంట్ చేసుకుంటారన్నారు.