ఎన్నికలకు సన్నద్ధం చేసే దిశగా పార్టీ కార్యకలాపాలు
పార్లమెంట్ ఎన్నికల్లో విజయకేతనమే లక్ష్యం
రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల ‘హస్త’గతం దిశగా కసరత్తు
హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికల్లో విజయకేతనమే లక్ష్యంగా రాష్ట్ర కాంగ్రెస్ కసరత్తులు చేస్తోంది. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందు నుంచే సమాయత్తమవుతున్న ఆ పార్టీ నాయకత్వం, 17 స్థానాలను హస్తగతం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా మంత్రులు, సీనియర్ నేతలను ఇంఛార్జ్‌లుగా నియమించింది. అటు క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నాయకులను ఎన్నికలకు సన్నద్ధం చేసే దిశగా పార్టీ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఎత్తుకు పైఎత్తులు, తమదైన వ్యూహాలతో రాష్ట్రంలో బీఆర్ఎస్ను గద్దె దించి, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రత్యేక దృష్టి సారించింది. మరో రెండుమూడ్నెళ్లలో పార్లమెంట్ ఎన్నికలు జరగనుండగా, తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా నాయకులు, శ్రేణులను సమాయత్తం చేసే దిశలో పార్టీ కార్యకలాపాలు మొదలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన స్థానాలు మినహా, మిగిలిన లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. అభ్యర్థిత్వం అంశంపై పార్టీ నుంచి ఇప్పటికే హామీ పొందిన పలువురు నేతలు, నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. శాసనసభ నియోజకవర్గాల వారీగా సమీక్షలు, పర్యటనలు జరుపుతూ, పార్టీ బలోపేతం దిశగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
టికెట్ కోసం నేతల ప్రయత్నాలు : శాసనసభ ఎన్నికల్లో టికెట్ లభించని వారితో పాటు, ఓటమి పాలైన పలువురు నేతలు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో, ఆదిలాబాద్ నుంచి 2014లో పోటీ చేసిన నరేశ్‌జాదవ్ మళ్లీ టికెట్ ఆశిస్తున్నారు. పెద్దపల్లి నుంచి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తనయుడిని బరిలోకి దించే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయం పోటీ చేసే అవకాశం ఉంది. నిజామాబాద్ నుంచి మహేశ్‌కుమార్‌గౌడ్‌తో పాటు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేరు సైతం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. జహీరాబాద్ నుంచి సురేశ్ షెట్కర్, మెదక్ ఎంపీ స్థానం నుంచి విజయశాంతి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి అలీ మస్కతి పేరు పరిశీలనలో ఉండగా, మల్కాజిగిరి నుంచి హరివర్దన్‌రెడ్డి ఉన్నారు. సికింద్రాబాద్ నుంచి డీసీసీ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌యాదవ్ లేదంటే, టీజేఎస్ నేత కపిల్వాయి దిలీప్‌కుమార్ బరిలోకి దిగొచ్చని ప్రచారం జరుగుతోంది. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి మహేశ్వరం కాంగ్రెస్ నేతలు చల్లా నర్సింహారెడ్డి, పారిజాత పోటీ పడుతున్నారు. మహబూబ్‌నగర్ నుంచి ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. నాగర్‌కర్నూల్ నుంచి పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, నల్గొండ నుంచి పటేల్ రమేశ్‌రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది.
ఖమ్మం స్థానాన్ని సీపీఐకి కేటాయిస్తారని చర్చ : భువనగరి నుంచి పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌రెడ్డి, వరంగల్ నుంచి అద్దంకి దయాకర్ లేదంటే సిరిసిల్ల రాజయ్య, మహబూబాబాద్ నుంచి బలరాంనాయక్, బెల్లయ్యనాయక్లలో ఎవరినైనా బరిలోకి దించే అవకాశం ఉందని హస్తం పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి పోటీ దృష్ట్యా, ఖమ్మం స్థానాన్ని సీపీఐకి కేటాయించవచ్చని తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల గడువు సైతం దగ్గర పడుతుండడంతో, మంత్రులు, ముఖ్యనేతలు తమకు కేటాయించిన నియోజకవర్గాలపై దృష్టి సారించారు. మల్కాజిగిరి పార్లమెంట్‌లోని పరిస్థితులపై నియోజకవర్గ ఇంఛార్జ్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షించారు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని 7 శాసనసభ నియోజకవర్గాలకు చెందిన నాయకులతో తుమ్మల సమావేశమయ్యారు. క్షేత్రస్థాయి పరిస్థితులను ఆరా తీసిన తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ సీటు గెలుపు కోసం ఎలా ముందుకెళ్లాలనే అంశాలపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరిలో ఓటమికి కారణాలను అన్వేశిస్తూనే, లోక్‌సభ ఎన్నికల్లో విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన చర్చించారు.