తహసిల్దార్ హత్య పై రెవెన్యూ మంత్రిని కలిసిన బొప్పరాజు బృందం
నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్
తహసిల్దార్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలి
ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు
విజయవాడ : విశాఖపట్నంలో తహసీల్దార్ రమణయ్య హత్య ఘటనలో నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి కంచరాపల్లి రమేష్ కుమార్ పేర్కొన్నారు. హత్య ఘటనపై సోమవారం సచివాలయంలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావుని రెవెన్యూ అసోసియేషన్ వారు కలిసి తహసీల్దారు రమణయ్య పై కిరాతకంగా దాడి చేసి హత్య చేసిన విషయమై నిన్న జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీసుకున్న తీర్మానాల ప్రకారం ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ పక్షాన మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడుతూ నిర్వహణలో ఉన్న ఉద్యోగుల పై దాడి చేయాలనే ఆలోచనే రాకుండా చట్టాలను ఇంకా కఠినతరం చేయాలని, అత్యంత కిరాతకంగా జరిగిన తహసీల్దారు రమణయ్య హత్య రాష్ట్రంలోని యావత్తు రెవిన్యూ ఉద్యోగులను అభద్రతా భావానికి గురిచేసిందని తెలిపారు. తహశీల్దార్ రమణయ్య హత్యకు కారకులను వెంటనే అరెస్ట్ చేయాలని, ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా హత్యకు కారకులైన నిందితులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, తహశీల్దార్ రమణయ్య కుటుంబాన్ని అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని, తక్షణమే ఎక్సగ్రేషియా ప్రకటించాలని, భార్యకు గ్రూప్-2 స్థాయి ఉద్యోగం కల్పించాలని రెవెన్యూ మంత్రి ధర్మాన ను కోరారు. ప్రభుత్వ భూములు కాపాడటం, భూ సంబందిత అంశాల పరిష్కారంలో నిత్యం తలమునకలై రెవిన్యూ ఉద్యోగులకు మానసిక ధైర్యం, నమ్మకం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, ఒక ఎక్జిక్యూటిప్ మేజిస్ట్రేట్ హోదాలో ఉన్న వ్యక్తిని ఇంత కిరాతకంగా హత్య చేసి హతమారిస్తే , సామాన్య రెవిన్యూ ఉద్యోగి పరిస్థితి ఏంటి అని, రాష్ట్రంలోని ప్రతీ రెవిన్యూ ఉద్యోగి భయాందోళనలకు గురి అగుచున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ,ఉద్యోగుల భద్రత విషయంలో ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని భూమి విలువ అత్యధికంగా పెరిగిన పట్టణ ప్రాంతాలలో విధి నిర్వహణలో ఉన్న అధికారులు, ఉద్యోగులకు తక్షణమే భద్రత, రెవిన్యూ అధికారులు, ఉద్యోగులు నివాసం ఉండటానికి ఇంటెగ్రేటెడ్ రెవిన్యూ క్వార్టర్స్ ఏర్పాటు చేసి, అక్కడ తగిన భద్రతా ఏర్పాట్లు చేస్తూ భూ వివాదాల పరిష్కారం కొరకు , భూ ఆక్రమణ తొలగింపులో ఐ.ఏ.యెస్, ఐ.పి.యెస్ స్థాయి అధికారులతో ప్రత్యేక విభాగాన్ని ప్రతీ జిల్లాలో నియమించి భూ రికార్డులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ మండలంలో స్వయం ప్రతిపత్తి కలిగిన న్యాయ విభాగాన్ని ఏర్పాటు చేయాలి, కోర్టు వివాదాలు ఎదుర్కోనుటకు తగినంత బడ్జెట్ ఇవ్వాలి, తద్వారా కోర్టు వివాదాలు త్వరితగతిన పరిష్కారం కోసం తోడ్పాటు అందించి ఉద్యోగులపై దాడి కి పాల్పడిన కేసుల విషయంలో ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించి, న్యాయం చేయాలన్నారు. పట్టణ ప్రాంత మండలాలు, భూవివాదాలు ఎక్కువగా ఉన్న సెన్సిటివ్ మండలాలలో తగినంత సిబ్బందిని నియమించాలి. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని ఉద్యోగుల పై దాడి జరిగితే నిందితులను వివిధ కారణాలతో తప్పించుకు పోకుండా, కఠినంగా శిక్షించేలా ఐ.పి.సీ లో మార్పులు చేయాలని కోరారు. పై మెమొరాండం ల పై సానుకూలంగా స్పందించిన రెవెన్యూ శాఖ మంత్రి మాట్లాడుతూ ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు, సంబంధిత అధికారులతో అన్ని విషయాలు చర్చిస్తున్నామని, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ తెలిపిన విషయాలపై కూడా ముఖ్యమంత్రితో వెంటనే చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రెవెన్యూ శాఖ మంత్రి ని కలిసిన వారిలో ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర సహా అధ్యక్షుడు పితాని త్రినాథ్ రావు, డిప్యూటీ కలెక్టర్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విశ్వేశ్వర నాయుడు గారు, గ్రామ రెవెన్యూ అధికారులు సంఘం రాష్ట్ర సహా అధ్యక్షుడు ఏ.సాంబశివ రావు, గ్రామ రెవెన్యూ సహాయకులు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరికపాటి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.