ఏలూరు : సమాజంలో ఆర్య, వైశ్యులు సేవా కార్యక్రమాల్లో ముందుంటారని వారి సేవా గుణాన్ని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత కొనియాడారు. అన్ని దానాలలో వారు ముందుంటారని అభినందించారు. ఏలూరులో సి.ఆర్. రెడ్డి కాలేజి ఆడిటోరియం లో ఆదివారం నిర్వహించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు అర్బన్ జిల్లాల ఆర్య వైశ్య సంఘం అధ్యక్ష, కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవానికి హోం మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అధ్యక్ష, కార్యవర్గ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం లక్కిడ్రిప్ డ్రా తీసి.. విజేతలకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ తాను ఆర్య, వైశ్యుల ఇంటి బిడ్డని తెలిపారు. కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గంలోని ప్రతి ఆర్యవైశ్య కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు. గోపాలపురం నియోజకవర్గం కి చెందిన వెలగా శ్రీరామమూర్తి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘానికి అధ్యక్షునిగా ఎన్నిక కావడం సంతోషకరమన్నారు. ఆయనకు హోంమంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఆర్యవైశ్యులకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆర్యవైశ్యుల ఇష్టదైవం కన్యకాపరమేశ్వరి ఆశీస్సులు అందరి పై ఉండాలని, వారి వ్యాపార అభివృద్ధి చెంది సమాజానికి మరిన్ని సహాయం చేయాలని హోంమంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆర్య వైశ్య సంఘం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.