న్యూ ఢిల్లీ : తెలంగాణలో మునుగోడు సహా దేశవ్యాప్తంగా ఆరు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల కౌంటింగ్ పూర్తయింది. తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర, బిహార్, హరియాణా, యూపీ రాష్ట్రాలలోని ఏడు నియోజకవర్గాల్లో ఫలితాలు వెలువడ్డాయి. తెలంగాణలోని మునుగోడులో తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. బీజేపీ -తెరాస మధ్య కొనసాగిన ఉత్కంఠ పోరులో కమలం పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి (తెరాస) 10వేల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు. కాంగ్రెస్ తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోగా ఆ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి డిపాజిట్ కూడా దక్కకపోవడం గమనార్హం.
అంధేరిలో ఉద్ధవ్ వర్గం అభ్యర్థి విజయం : నోటాకు రెండో స్థానం
అంధేరీ (తూర్పు) సిట్టింగ్ ఎమ్మెల్యే రమేశ్ లట్కే మరణించడంతో జరిగిన ఉప ఎన్నికలో శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం అభ్యర్థి, రమేశ్ లట్కే సతీమణి రుతుజ లట్కే విజయం సాధించారు. అయితే, ఇక్కడ బీజేపీ , ఏక్నాథ్ శిందే వర్గం తమ అభ్యర్థిని ఉపసంహరించుకోవడంతో పోటీ ఏకపక్షమే అయింది. ఎన్సీపీ, కాంగ్రెస్ కూడా రుతుజాకే మద్దతు ఇవ్వడంతో చివరకు స్వతంత్రులు మాత్రమే బరిలో ఉన్నారు. శివసేన ఉద్ధవ్ వర్గానికి ఈసీ కేటాయించిన కొత్త గుర్తు ‘కాగడా’తో ఈ ఎన్నికల బరిలో నిలవగా.. రుతుజాకు 66వేల ఓట్లు వచ్చాయి. అయితే బరిలో నిలిచిన ఆరుగురు స్వతంత్ర అభ్యర్థుల కన్నా నోటాకే అధికంగా ఓట్లు రావడం గమనార్హం. అంధేరీలో మొత్తం 86,570 ఓట్లు పోల్ అవ్వగా లట్కేకు 66,530 ఓట్లు, నోటాకు 12,806 (14.79శాతం) ఓట్లు వచ్చాయి. మిగతా ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులలో ఎవరికీ 1600కు మించి ఓట్లు రాకపోవడం గమనార్హం. ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే తిరుగుబాటుతో మహారాష్ట్రలో శివసేన రెండు వర్గాలుగా విడిపోయిన తర్వాత జరిగిన తొలి ఎన్నిక ఇదే.
అదంపూర్‌లో మళ్లీ భజన్‌లాల్ వారసత్వమే : హరియాణాలోని మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ కుటుంబం ప్రతిష్ఠాత్మకంగా భావించిన అదంపూర్ ఉపఎన్నికపై ఉత్కంఠ వీడింది. అక్కడ బీజేపీ తరఫున బరిలో దిగిన భజన్‌లాల్ మనమడు భవ్య బిష్ణోయ్ విజయం సాధించారు. భజనల్‌లాల్ తనయుడు కుల్దీప్ బిష్ణోయ్ ఇటీవల కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరడంతో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం వల్ల ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే, ఆయన తనయుడు భవ్య బిష్ణోయ్‌కి భాజపా సీటు ఇచ్చింది. దీంతో ఈ ఎన్నికల్లో ఆయనకు 67,462 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి 51,752 ఓట్లు వచ్చాయి.అదంపూర్ భజనల్‌లాల్ కుటుంబానికి కంచుకోట. 1968 నుంచి అక్కడ ఆ కుటుంబానిదే హవా. మాజీ సీఎం భజనల్‌లాల్ ఇక్కడి నుంచి తొమ్మిదిసార్లు ప్రాతినిధ్యం వహించగా ఆయన సతీమణి జస్మా దేవి ఒకసారి, కుల్దీప్ నాలుగు పర్యాయాలు ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందడం విశేషం.
ధామ్‌నగర్ మళ్లీ బీజేపీ దే : ఒడిశాలోని ధామ్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించింది. బిజూ జనతాదళ్ (బిజద) అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి 9,881 ఓట్ల తేడాతో విజయం సాధించినట్టు కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. ఇక్కడ బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బిష్ణు చరణ్ సేథి సెప్టెంబర్‌లో మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో సేథి తనయుడు సూర్యభన్షి సూరజ్‌కు బీజేపీ ఆ సీటు ఇచ్చింది. ఈ ఎన్నికల్లో ఆయనకు 80,351 ఓట్లు పోలవ్వగా బిజద అభ్యర్థి అబంటి దాస్‌కు 70,470 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ తరఫున బరిలో దిగిన బాబా హరేకృష్ణ సేథికి కేవలం 3,561 ఓట్లు మాత్రమే వచ్చాయి.
గోలా గోకర్ణ్నాథ్ను నిలబెట్టుకున్న కమలనాథులు : ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోలా గోకర్ణ్‌నాథ్ సీటును బీజేపీ నిలబెట్టుకుంది. ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే అర్వింద్ గిరి మరణంతో ఈ ఎన్నిక జరగ్గా ఆయన తనయుడు అమన్‌గిరిని భాజపా బరిలో దించింది. దీంతో తమ సమీప ప్రత్యర్థి సమాజ్‌వాదీ పార్టీకి చెందిన వినయ్ తివారీపై అమన్గిరి 34వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. మొత్తం 57.35శాతం పోలింగ్ నమోదు కాగా.. ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. కాంగ్రెస్, బీఎస్పీ అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ప్రధానంగా బీజేపీ , ఎస్పీ మధ్యే పోటీ నెలకొంది. మొత్తం ఓట్లలో అమన్గిరికి 1,24,810 ఓట్లు రాగా వినయ్ తివారీకి 90,512ఓట్లు వచ్చాయి.
బిహార్‌లో రెండు స్థానాలూ ఎవరివి వారికే : బిహార్‌లోని గోపాల్‌గంజ్, మొకామా అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఆర్జేడీ ఎవరి స్థానాలు వారు సుస్థిరం చేసుకున్నారు. గోపాల్‌గంజ్‌లో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సుభాష్ సింగ్ మృతిచెందగా మొకామాలో ఆర్జేడీ ఎమ్మెల్యే అనంత్‌సింగ్‌పై అనర్హత వేటు పడటంతో ఎన్నికలు అనివార్యమైన సంగతి తెలిసిందే. దీంతో ఈ రెండు స్థానాల్లో ఆయా పార్టీలు ఆ నేతల సతీమణుల్ని బరిలో దించి తమ స్థానాలను నిలబెట్టుకోగలిగారు. మొకామా స్థానంలో బీజేపీ పోటీచేయడం ఇదే తొలిసారి. గతంలో ఈ స్థానాన్ని తన మిత్రపక్షాలకు కేటాయిస్తూ వచ్చేది. గోపాల్‌గంజ్‌లో సుభాష్ సింగ్ సతీమణి కుసుమ్ దేవికి 70,032 ఓట్లు రావడంతో ఆమె విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి ఆర్జేడీ అభ్యర్థి మోహన్ గుప్తాకు 68,243 ఓట్లు వచ్చాయి. అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఎంఐఎం, బీఎస్పీలు బరిలో నిలిచినా మూడు, నాలుగు స్థానాలకే పరిమితమయ్యాయి. బీఎస్పీ తరఫున బరిలో నిలిచిన ఇందిరా యాదవ్ ఆర్జేడీ అధినేత లాలూ సతీమణి రబ్రీదేవి సోదరుడు సాధు యాదవ్ భార్య కావడం గమనార్హం. 2000 సంవత్సరంలో సాధు యాదవ్ ఇక్కడ నుంచే గెలుపొందారు. అయితే, ఓ ఐఏఎస్ అధికారి పట్ల అనుచితంగా ప్రవర్తించిన కేసులో దోషిగా తేలడంతో ఎన్నికల్లో పోటీచేసేందుకు ఆయన అనర్హుడయ్యారు.