విజయవాడ : కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో వైసీపీ నేత దుట్టా రామచంద్రరావుతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. ఏలూరు నుంచి విజయవాడ వెళ్తూ మార్గమధ్యలో హనుమాన్ జంక్షన్లో దుట్టా ఇంటికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి సన్నిహితుడైన దుట్టాతో షర్మిల భేటీ కావడం రాజకీయంగా చర్చకు దారితీసింది. పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న షర్మిల వైఎస్ఆర్ సన్నిహితులు, గతంలో కాంగ్రెస్‌లో కీలకంగా పనిచేసిన నాయకులను కలుస్తున్నారు. దుట్టాను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సీనియర్ నేతలు రఘువీరారెడ్డి, పల్లం రాజు, రుద్రరాజు తదితరులు ఆమె వెంట ఉన్నారు.