హైదరాబాద్ : బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నేతలందరూ కలిసి పనిచేస్తేనే లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. గురువారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బూత్‌స్థాయి కన్వీనర్ల సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. రెండు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కోసం అంతా కలిసి పనిచేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీకి బూత్ స్థాయి కార్యకర్తలే బలమని, కష్టపడి పనిచేయాలని కోరారు. ఈడీ, సీబీఐ దాడులు జరిగే అవకాశముందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి కృషి చేయాలన్నారు. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ప్రధాని మోడీ గతంలో ఎన్నో హామీలు ఇచ్చారు. నల్లధనం తీసుకొచ్చి ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15లక్షల చొప్పున వేస్తామని చెప్పారు. కానీ, ఆ హామీని మర్చిపోయారు. తెలంగాణలో ఆరు గ్యారంటీల్లో రెండింటిని అమలు చేశాం. త్వరలోనే మరో రెండు అమలు చేస్తాం. తెలంగాణ ప్రభుత్వ పనితీరు దేశానికి ఆదర్శం కావాలి. మోడీకి రైతుల బాధలు, కష్టాలు తెలియవు. ఆయన సమస్యలు పరిష్కరించరు. పక్కదారి పట్టిస్తారు. పాకిస్థాన్, చైనా, దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉంది. అందుకే భారాస, బీజేపీ ఓడించాం. ప్రజలకు న్యాయం చేయడం కోసమే రాహుల్ గాంధీ న్యాయ్ యాత్ర చేస్తున్నారు. నరేంద్ర మోడీ మాటలు నమ్మి ప్రజలు మరోసారి మోసపోవద్దు. దేశాన్ని అప్పుల్లో ముంచారు. ప్రభుత్వ ఖర్చుతో ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. పదేళ్ల బీజేపీ పాలనలో వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. మణిపుర్ అగ్నిగుండంలా మారి వేలాది మంది చనిపోతే ఒక్కసారి కూడా ప్రధాని అక్కడికి వెళ్లలేదు. నరేంద్ర మోడీ, బీజేపీ ఎప్పుడూ ఎన్నికల్లో గెలిచే కుట్రలే చేస్తారు’’ అని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి, కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్షి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్‌రెడ్డి పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.