సంస్కృత భాగవతారిణి!
సంగీతమే జీవితం, కళలే ప్రపంచంగా బతికే నాదస్వర విద్వాంసుల కుటుంబంలో పుట్టింది ఉమామహేశ్వరి. బాల్యంలోనే హరికథా గానంలోకి అడుగుపెట్టింది. ఆబాల గోపాలాన్ని అలరించింది. ఏకైక సంస్కృత హరికథా కళాకారిణి అయిన ఉమామహేశ్వరిని తాజాగా భారత ప్రభుత్వం సంగీత నాటక అకాడమీ అవార్డుకు ఎంపిక చేసింది. ప్రపంచ వేదికలపై ప్రదర్శనలిచ్చిన తెలంగాణ కోడలు చెప్పే హరికథ ముచ్చట్లివి…
మా పూర్వికులంతా సంగీత విద్వాంసులు. నాన్న దాలిపర్తి లాలాజీ రావు వేములవాడ దేవస్థానంలో నాదస్వర విద్వాంసులు. అమ్మ సరోజని గాయని. ఆరేండ్ల వయసులోనే నాన్న నాకు సంగీత శిక్షణ మొదలుపెట్టారు. ఇంటి విద్య సరిగా అబ్బదని భైరవభట్టు సుబ్బారావుగారి దగ్గర చేర్పించారు. అమ్మానాన్నలకు హరికథలంటే ఇష్టం. ఓసారి కోట సచ్చిదానంద శాస్త్రి గారి హరికథకు నన్నూ తీసుకెళ్లారు. ఆయన నలభై రోజులు హరికథ చెప్పారు. అప్పుడు నా వయసు ఎనిమిదేండ్లు. రోజూ ఇంటికి వచ్చాక అగ్గిపెట్టెలను చిడతల్లా చేసుకుని హరికథ చెప్పేదాన్ని.
పద్నాలుగేండ్లకే…
మచిలీపట్నంలోని రామానాయుడుపేటలో ఉండేవాళ్లం. మా ఇంటికి దగ్గర్లో చల్లపల్లి రాజావారి మేనకోడలు ఉండేవారు. మా తాతయ్య.. అమ్మవాళ్ల నాన్న గొప్ప విద్వాంసులు. ఆయన చల్లపల్లి రాజా కుటుంబానికి సన్నిహితుడు. అలా జమీందారు మేనకోడలు బలుసు రాజరాజేశ్వరమ్మకు మామీద అభిమానం. నేను సంగీతం నేర్చుకుంటున్నాని ఆమెకు తెలిసింది. ‘మా మామగారి పేరుమీద కపిలేశ్వరపురం (తూర్పు గోదావరి జిల్లా)లో సర్వారాయ హరికథా పాఠశాల నెలకొల్పాం. మీ అమ్మాయిని కూడా చేర్పించాలి’ అని సలహా ఇచ్చారామె. పదో తరగతి పరీక్షలు రాసిన మూడో రోజే నాన్న అందులో చేర్పించారు. అప్పుడు నాకు నిండా పద్నాలుగేండ్లు. నెల రోజులు గడిచేసరికి అక్కడ ఉండాలనిపించలేదు. మా నాన్న వచ్చారు. ‘మా వాళ్లందరూ బెంగపెట్టేసుకున్నారు.
తీసుకుపోతా’ అన్నారు. ‘మీ అమ్మాయికి హరికథ బాగా వస్తుంది. నెల రోజుల్లోనే గౌరీ కల్యాణం చెప్పింది! నెలనెలా మచిలీపట్నం వచ్చినప్పుడు మీ అమ్మాయిని వెంటబెట్టుకొస్తాను. నేను పుట్టిన ఊరి నుంచి వచ్చింది. మంచి కళాకారిణిగా తీర్చిదిద్దుతాను’ అని మాటిచ్చారామె. దీంతో అక్కడే ఉండిపోయాను.
నటరాజ శిక్షణలో
అయిదేండ్లలో సంగీతం, నాట్యం, తెలుగు, సంస్కృతం నేర్చుకున్నాను. పది హరికథలు కంఠపాఠం అయ్యాయి. ఇక ఇంటికి పోవాలనిపించింది. కానీ, నిర్వాహకులు రామాయణం, భారతం కూడా నేర్చుకోవాలని పట్టుబడితే ఇంకా అక్కడే ఉండాల్సి వచ్చింది. ‘తెలుగులో చెబితే ఇక్కడివాళ్లే వింటారు. సంస్కృతంలో అయితే దేశమంతా వింటారు’ అని జమీందారు ఎస్.పి.బి.కె. సత్యనారాయణ గారు చెప్పడంతో సంస్కృత నాటకం నేర్చుకోవాల్సి వచ్చింది. కాళిదాసు కుమారసంభవం కావ్యాన్ని ఎన్.సి.హెచ్. కృష్ణమాచార్యులు సంస్కృత హరికథగా మలచారు. ఆయనే రాగాలు కట్టారు. మ్యూజిక్ టీచర్ సాయంతో ఆ శ్లోకాలు సాధన చేశాను. నటరాజ రామకృష్ణ దగ్గర అభినయం నేర్చుకుంటే బాగుంటుందని హైదరాబాద్ పంపారు.
కాళిదాస కావ్యనాయకి
ఉజ్జయిని ఉత్సవాలను పునః ప్రారంభిస్తున్నట్టు, ఈ ఉత్సవాలలో ప్రదర్శన ఇచ్చేందుకు కళాకారులను ఆహ్వానిస్తున్నట్టు కాళిదాస్ అకాడమీ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది. ఆ వేడుకల్లో సంస్కృత హరికథ ప్రదర్శన ఇచ్చాను. జమీందారు కుటుంబం నాకు ఏ లోటూ లేకుండా చూసుకున్నది. జమీందారుగారు చెప్పారనే ఉద్దేశంతో కాదనకుండా నేర్చుకున్నాను. ఆ ఒక్క కథతో ముగిద్దామంటే పది కథలు నేర్చుకోవాల్సి వచ్చింది. కాళిదాసు ఉత్సవాల్లో పాల్గొనాలని వాళ్లు పిలవడం, నేను పోవడం వరుసగా పదేళ్లు జరిగింది. ఇంకేదైనా హరికథ చెప్పాలని ఉజ్జయిని వాళ్లే సూచించారు. అప్పుడు అభిజ్ఞాన శాకుంతలం చెప్పాను. మరో సంవత్సరం మాళవికాగ్నిమిత్రం చెప్పాను. మేఘసందేశం, రఘువంశం, గీతగోవిందం కూడా చెప్పాను. పూరి విశ్వవిద్యాలయం కోసం జయదేవుడు రచించిన గీత గోవిందం నేర్చుకుని మరీ కథాగానం చేశాను. అలా హరికథే నా జీవితమైపోయింది.
తెలంగాణ కోడలిగా..
నటరాజ రామకృష్ణ గారి దగ్గర ఆంధ్ర నాట్యం నేర్చుకుందామని హైదరాబాద్ వచ్చాను. దేశమంతా ప్రదర్శనలిస్తూనే ఆయన దగ్గర నాలుగేండ్లు సాధన చేశాను. ఇక్కడే కళాకృష్ణ పరిచయమయ్యారు. ‘ఇద్దరం కళాకారులం. ఒకరికొకరు సహకరించుకోవచ్చు. పెళ్లిచేసుకుందాం’ అని ప్రతిపాదించారు. అప్పటికే పెండ్లి సంబంధాలు వస్తున్నాయి. ఐఏఎస్ పెండ్లి సంబంధాన్ని కూడా కాదనుకొన్నాను. ‘కళాకారుడిని పెండ్లి చేసుకుంటావా? కళాకారులుగా జీవితంలో ఎన్నో పోగొట్టుకున్నాం. బాధలుపడ్డాం. నీకూ ఆ బాధలు పడాలని ఉందా?’ అని నాన్న కన్నీళ్లు పెట్టుకున్నారు. కళాకారిణిగా బతకాలన్నదే నా కోరిక. కళాకృష్ణ, నేను ఒకరినొకరు అర్థం చేసుకున్నాం. అలా పెద్దవాళ్లని ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. ‘తెలంగాణ ప్రాంతానికి కోడలు అయ్యావు. ఇక్కడ హరికథను వ్యాప్తిచేయాలి’ అని రమణాచారిగారు పట్టుపట్టారు. తెలుగు విశ్వవిద్యాలయంలో లెక్చరర్‌గా పనిచేసే అవకాశం ఇస్తామన్నారు. కానీ, అప్పటికే సర్వారాయ హరికథా పాఠశాలలో నెలలో వారం రోజులు చెబుతున్నాను. నాకు విద్య నేర్పిన వాళ్లను కాదనలేక తెలుగు విశ్వవిద్యాలయం ఉద్యోగం వద్దనుకున్నాను. తెలంగాణలో ప్రదర్శనలు ఇస్తూ, ఔత్సాహికులకు నేర్పిస్తూ ఉన్నాను.
హరికథా విజయం!
చదువుకునే రోజుల నుంచే హరికథా ప్రదర్శనలు ఇస్తున్నాను. హార్వర్డ్ విశ్వవిద్యాలయం నిర్వహించే ‘అంతర్జాతీయ వైదిక సమ్మేళనం’లో పాల్గొనాలని ప్రొఫెసర్ మైకేల్ విజ్జల్ ఆహ్వానించారు. అలా అమెరికా, ఇంగ్లండ్ దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చాను. న్యూయార్క్ తెలుగు అసోసియేషన్ ‘హరికథా కళాప్రవాహిని’ బిరుదుతో సత్కరించింది. కాళిదాస్ అకాడమీ (ఉజ్జయిని) చిత్రకథా సరస్వతి బిరుదు ఇచ్చింది. శృంగేరి పీఠాధిపతి అభినవ మాతంగి బిరుదుతో గౌరవించారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరు నమోదయ్యింది. భారతదేశ పూర్వ రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ ‘ఏకైక సంస్కృత హరికథా కళాకారిణి’
బిరుదు ప్రదానం చేశారు. ఇప్పుడు సంగీత నాటక అకాడమీ అవార్డు వరించడం సంతోషంగా ఉంది. తెలంగాణలో హరికథకు ప్రాచుర్యం కల్పించినందుకు తెలంగాణ ప్రభుత్వం నన్ను గుర్తించింది. సంగీత నాటక అకాడమీ అవార్డుకు నా పేరు సూచించింది. ఎందరో పెద్దలు దాన్ని బలపరిచి ఇంతటి గౌరవం దక్కేలా చేశారు.