అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాను విడుదల చేసింది. దాని ప్రకారం ఏపీలో 4 కోట్లా 8 లక్షలమంది ఓటర్లున్నారు. వీరిలో మహిళల సంఖ్యే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఏపీలో మహిళా ఓటర్ల సంఖ్య 2 కోట్లా 7 లక్షలమంది అని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. పురుషుల ఓట్లు సుమారుగా రెండు కోట్లా లక్ష ఉన్నాయి. ఏపీలో మహిళల కన్నా పురుషుల ఓట్లు దాదాపు ఆరు లక్షలు తక్కువగా ఉన్నాయి. ఇక జిల్లాల వారీగా చూస్తే జిల్లాల విభజన తర్వాత అత్యధిక ఓట్లు కలిగిన జిల్లాగా తిరుపతి నిలుస్తూ ఉంది. పాత చిత్తూరు నుంచి కొంత, నెల్లూరు జిల్లా నుంచి మరి కొంత కలిపి తిరుపతిని జిల్లాగా చేశారు. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లాలో అత్యధిక ఓటర్లున్నారు.
ఆ తర్వాత చిత్తూరు, ఎన్టీఆర్ జిల్లా, కాకినాడ, కృష్ణా జిల్లాలున్నాయి. తిరుపతి జిల్లాలో సుమారు 17 లక్షల ఓట్లున్నాయి. మిగతా నాలుగు జిల్లాల్లోనూ ఒక్కోదాంట్లో 15 లక్షలమందికి పైనే ఓటర్లున్నారు. మరో విశేషం ఏమిటంటే ఏపీలో తొలిసారిగా ఓటు హక్కు కోసం అప్లై చేసుకున్న వారి సంఖ్య తక్కువేనని ఎన్నికల కమిషన్ వివరాలను బట్టి తెలుస్తోంది. 18 యేళ్ల వయసు నిండి, ఓటు హక్కు కోసం అప్లై చేసుకున్న వారి సంఖ్య ఎనిమిది లక్షల వరకూ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ సంఖ్య మరి కాస్త ఎక్కువగా ఉండాల్సిందని, యువ ఓటర్లలో ఓటు హక్కుపై నమోదు పెంచే ప్రయత్నం చేయనున్నట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏపీలో దొంగ ఓట్లు అంటూ అధికార, ప్రతిపక్షాల పోటాపోటీ ఫిర్యాదుల అనంతరం కేంద్రం ఎన్నికల సంఘం ఈ తుదిజాబితాను వెబ్ సైట్లో అందుబాటులో పెట్టినట్టుగా ప్రకటించింది.