ఈశాన్య రాష్ట్రం మణిపుర్లో ఆర్టికల్ 355 అమలు చేసినట్లు అటు కేంద్రం గానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం గానీ వెల్లడించకపోవడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రెండు జాతుల మధ్య తలెత్తిన వివాదంతో అట్టుడికిపోయిన ఈశాన్య రాష్ట్రం మణిపుర్లో పరిస్థితులు సద్దుమణగడం లేదు. అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఈ తరుణంలో 25 కుకీ తిరుగుబాటు గ్రూప్లతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అఖిలపక్షం కోరింది. ఈమేరకు ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో డిమాండ్ చేసింది. ఒప్పందం రద్దయితే కుకీ తిరుగుబాటుదారులపై చర్యలు తీసుకునేందుకు వీలుపడుతుందని విపక్ష పార్టీలు అభిప్రాయపడ్డాయి.
మరోవైపు ఆర్టికల్ 355ని అమలుచేస్తున్నట్లు రాష్ట్ర ప్రజలకు అటు కేంద్రం గానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ వెల్లడించకపోవడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. గతేడాది మేలో కుకీ, మైతేయి తెగల మధ్య జరిగిన హింసతో మణిపుర్లో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. ఈ క్రమంలో శాంతిభద్రతలను అదుపులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. రాష్ట్ర అభ్యర్థన మేరకే కేంద్రం బలగాలను మోహరించిందని అనుకున్నామని, ఆర్టికల్ 355ని అమలుచేసినట్లు తమకు తెలియదని మణిపుర్ పీసీసీ అధ్యక్షుడు మేఘాచంద్ర సింగ్ అన్నారు. ఈవిషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ నిబద్ధతను మరిచి ప్రవర్తించాయని విమర్శించారు. ఇప్పటివరకు ఈ అంశాన్ని ప్రస్తావించకపోవడం వెనక కారణాలేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 355 ప్రకారం అంతర్గత ఘర్షణలను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనప్పుడు, విదేశీ దురాక్రమణల సమయంలో శాంతిభద్రతలను కాపాడేందుకు కేంద్రం నేరుగా చర్యలు తీసుకోవచ్చు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి అక్కర్లేదు. అలాగని రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాల్సిన అవసరం లేదు. రాష్ట్రపతి పాలనకు ముందు దశగా దీనిని చెబుతుంటారు. మరోవైపు మణిపుర్లో రాష్ట్రపతి పాలన విధించాలని కుకీ- తెగకు చెందిన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అదే జరిగితే భద్రతా బలగాలు, ప్రభుత్వ విధానాల విషయంలో తటస్థ పరిస్థితులు నెలకొంటాయంటున్నారు. అయితే, మణిపుర్లో కేంద్ర బలగాలకు రాష్ట్రప్రభుత్వం సహకరిస్తోందని, రాష్ట్రపతి పాలన అవసరం లేదని ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర హోం మంత్రి అమిత్షా స్పష్టంచేశారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోడీ అపాయింట్మెంట్ తీసుకోవాలని ముఖ్యమంత్రి బీరేన్సింగ్కు అఖిలపక్ష నేతలు కోరారు. అంతా కలిసి వెళ్లి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ఆయనకు వివరించాలని తీర్మానించారు.