డిగ్రీ లు కలిగి వ్యవసాయం చేయడం ప్రశంసనీయం
ఏలూరు జిల్లాలో బంగ్లాదేశ్ బృందం రెండవ రోజు పర్యటన
ఏలూరు : పండించే వారి సంఖ్య తగ్గుతూ తినే వారి సంఖ్య పెరుగుతున్న నేటి రోజుల్లో రైతు సాధికార సంస్థ రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతు శాస్త్రవేత్త కోర్సు ప్రపంచానికే ఆదర్శమని బంగ్లాదేశ్ ప్రతినిధి బృందం ప్రశంసించింది. ఒకవైపు ప్రకృతి వ్యవసాయం చేస్తూ కోర్సు చేయడం నిజంగా అభినందించదగ్గ విషయం అని కొనియాడారు. రాష్ట్రంలో మూడవ రోజు పర్యటనలో భాగంగా బృంద సభ్యులు ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం లోని వెంకట రామన్న గూడెం, పెద్ద వెల్లమిల్లి, నాచుగుంట గ్రామాలలోని వేర్వేరు రైతుల ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. ఈ సంధర్భంగా పెద్ద వెల్లమిల్లి గ్రామంలోని రాజేంద్ర ప్రసాద్ ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో రైతు శాస్త్రవేత్తలు, మెంటార్ లతో బృంద సభ్యులు సమావేశమయ్యారు. రైతు శాస్త్రవేత్త లను ఉద్దేశించి మాట్లాడుతూ వ్యవసాయంలో డిగ్రీ కలిగిన వ్యవసాయ నిపుణులు ఒకవైపు ప్రకృతి వ్యవసాయం చేస్తూనే రైతులకు సలహాలు సూచనలు అందిస్తూ ఏటీఎం, ఏ గ్రేడ్, 5 అంతస్తుల నమూనా, సమీకృత మోడల్ తదితర ఆదర్శనీయ వ్యవసాయ క్షేత్రాలను తీర్చిదిద్దు తున్నారని రైతు శాస్త్రవేత్తలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. మా దేశంలో చేస్తున్న ప్రకృతి వ్యవసాయ తీరుతో పోల్చితే మీరు చేస్తున్న తీరు ఎంతో బాగుందని, మీ ఆతిథ్యం కూడా మాకు చాలా బాగా నచ్చిందని అన్నారు. రైతు శాస్త్రవేత్తల్లో మహిళలు కూడా అధిక సంఖ్యలో ఉండటం వ్యవసాయంలో మహిళల ప్రోత్సాహానికి అద్దం పడుతోందని అన్నారు. మహిళలు వ్యవసాయంలో భాగస్వామ్యం పంచుకోవడం శుభ పరిణామం అన్నారు. ఈ సంధర్భంగా రైతు శాస్త్రవేత్తలను ప్రకృతి వ్యవసాయ విధానంలో చేస్తున్న పరిశోధనలు, సాధిస్తున్న ఫలితాల గురించి అడిగి తెలుసుకొన్నారు.
బంగ్లాదేశ్ బృందం అంతకు ముందు వెంకట రామన్న గూడెం గ్రామంలోని రాజేంద్ర ప్రసాద్ రైతు ఒక ఎకరా వి స్తీర్ణంలో అనుసరిస్తున్న “పాలి వెజిటబుల్ మోడల్ ను సందర్శించింది. ఎకరాకు ఏడాది కాలంలో 1.52 లక్షల ఖర్చుతో 2,65,700 ఆర్జించినట్లు రైతు బృంద సభ్యులకు వివరించారు. ప్రకృతి వ్యవసాయంలోకి రాక ముందు కేవలం వరి పంట మాత్రమే వేసే అలవాటు ఉందని, ప్రకృతి వ్యవసాయ విధానంలో వరితో పాటు ఫిష్ పాండ్, 20 రకాల పండ్లు కూరగాయలు పండిస్తున్నట్లు చెప్పారు. గతంలో కేవలం 40 వేల నికర ఆదాయం ఉండేదని, ఈ సమీకృతి ప్రకృతి వ్యవసాయం వల్ల అధిక లాభం పొందుతున్నట్లు తెలిపారు. ఆ తర్వాత పెద్ద వెల్లమిల్లి గ్రామంలో కూడా రాజేంద్ర ప్రసాద్ వ్యవసాయ క్షేత్రంలోని ఏటీఎం ఏ గ్రేడ్, 5 అంతస్తుల నమూనాలను బృందం సందర్శించింది. అనంతరం నాచుగుంట గ్రామంలోని శ్రీ జీ వెంకట రత్నాజి వ్యవసాయ క్షేత్ర పరిధిలోని 70 ఎకరాల కాంపాక్ట్ బ్లాక్ ను సందర్శించారు. అక్కడ రైతు పండిస్తున్న విధానాలతో పాటు మార్కెటింగ్ సౌకర్యాలను అడిగి తెలుసుకొన్నారు. అనంతరం విజయవాడ తిరిగి వెళ్తూ మార్గ మధ్యంలో ఆర్గానిక్ స్టోర్ ను సందర్శించారు. ఈ పర్యటనలో రైతు సాధికార సంస్థ థిమాటిక్ లీడ్ లు అరుణ,రాము ఏలూరి, సురేష్ , జిల్లా ప్రాజెక్టు మేనేజర్ తాతా రావు , అదనపు డీపీఎం వలి తదితరులు పాల్గొన్నారు