నెల్లూరు : గత ప్రభుత్వాలు బడుగు, బలహీన వర్గాలను పట్టించుకోలేదని, వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక బడుగు, బలహీన వర్గాలను అభివృద్ధి చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట సామాజిక సాధికార బస్సుయాత్రలో నారాయణస్వామి మాట్లాడుతూ ఏపీకి ఎవరొచ్చినా సీఎం జగన్‌ను ఏమీ చేయలేరు. మేలు జరిగి ఉంటేనే ఓటు వేయమని ధైర్యంగా జగన్ అడుగుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్ రాజకీయ పదవులు ఇచ్చారన్నారు. ఎస్సీలుగా ఎవరైనా పుడతారా అని చంద్రబాబు హేళన చేసి మాట్లాడారన్నారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తే దానిని కూడా తట్టుకోలేకపోతున్నారని, వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ చీల్చిందన్నారు. వైఎస్ చనిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్లో ఆయన పేరు చేర్చారు. వైఎస్ కుటుంబం అంటే నాకు ఎంతో గౌరవం. దళిత ప్రజా ప్రతినిధులు అందరూ వైఎస్ జగన్‌తోనే ఉంటారు. కాంగ్రెస్‌లో చేరి జగనన్నపై యుద్ధం చేస్తామని షర్మిల అంటున్నారు. తప్పు చేయని వైఎస్ జగన్‌ను కాంగ్రెస్ పార్టీ జైల్లో పెట్టింది. ఇవన్నీ గుర్తులేవా? అని ప్రశ్నించారు.
మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ గతంలో ఎందరో ముఖ్యమంత్రులు వచ్చారు. ఎంతో కొంత చేశారు. కానీ ఎస్పీ, ఎస్టీ, బీసీ మహిళలకు యాభై శాతం పదవులు ఇచ్చిన ఘనత మాత్రం జగన్‌కే దక్కుతుంది. చంద్రబాబు ఎక్కడో మూలన, అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. నగరం నడిబొడ్డున ఉండాలని జగన్ నిర్ణయించి స్వరాజ్ మైదాన్‌లో పెట్టించారు. జగన్నే లక్ష్యం చేసుకునే కుట్రలు చేస్తున్నారు. ఇందుకోసం కుటుంబాల్లో కూడా చిచ్చుపెడుతున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల కూడా వారి కుట్రలో భాగస్వామ్యమయ్యారు. వైఎస్సార్సీపీ చీల్చి చంద్రబాబుకు ప్రయోజనం కలిగించాలని చూస్తున్నారు. షర్మిల మాట్లాడిన ప్రతిమాటను వైఎస్సార్ అభిమానులను బాధిస్తోంది. వైఎస్సార్‌ను దేవుడిగా భావించే ప్రతి కుటుంబం కూడా బాధపడుతోంది. షర్మిల మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని తెలిపారు.