తిరుమల : అయోధ్యలో ఈ నెల 22వ తేదీన ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా భక్తులకు అందించేందుకు శ్రీవారి లడ్డూప్రసాదాన్ని పంపుతున్నట్టు టీటీడీ అదనపు ఈవో(ఎఫ్ఏసి) వీరబ్రహ్మం తెలిపారు. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్-1 నుంచి శ్రీవారి లడ్డూప్రసాదంతో కూడిన బాక్సులను శుక్రవారం రాత్రి తిరుపతి విమానాశ్రయానికి తరలించారు. ఈ సందర్భంగా సేవా సదన్ వద్ద వీరబ్రహ్మం మీడియాతో మాట్లాడుతూ అయోధ్యకు ఒక లక్ష చిన్న లడ్డూలను శ్రీవారి ప్రసాదంగా పంపాలని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించిందన్నారు. ఇందుకోసం టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి, ఈవో ఏవి.ధర్మారెడ్డి ప్రత్యేక శ్రద్ధతో స్వచ్ఛమైన దేశీయ ఆవునెయ్యిని వినియోగించి లడ్డూలు తయారు చేయించినట్లు చెప్పారు. లడ్డూల తయారీకి బోర్డు సభ్యులు సౌరభ్ బోరా 2 వేల కిలోలు, మాజీ బోర్డు సభ్యులు జూపల్లి రామేశ్వరరావు 2 వేల కిలోల దేశీయ ఆవు నెయ్యిని విరాళంగా అందించినట్లు తెలియజేశారు. గురువారం శ్రీవారి సేవకులతో మొత్తం 350 బాక్సుల్లో ఒక లక్ష లడ్డూలను ప్యాకింగ్ చేశామని చెప్పారు. మరో బోర్డు సభ్యులు శరత్ చంద్రారెడ్డి సహకారంతో ఈ లడ్డూలను తిరుపతి విమానాశ్రయం నుంచి ప్రత్యేక కార్గో విమానం(ఏరో గ్రూపు) ద్వారా అయోధ్యకు పంపుతున్నట్లు తెలిపారు. శనివారం ఈ లడ్డూప్రసాదాన్ని అయోధ్యలో శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు అందజేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా శ్రీవారి సేవా సదన్ ప్రాంగణం రామనామంతో మారు మోగింది. పలువురు శ్రీవారి సేవకులు, భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ పీఆర్వో డా.టి.రవి,డెప్యూటీ ఈవో జనరల్ శివప్రసాద్, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శ్రీదేవి, పోటు ఏఈవో శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.