అమరావతి : దేశ చరిత్రలో ఎప్పుడూ, ఎక్కడా జరగని విధంగా ఆంధ్రప్రదేశ్ లో అక్కచెల్లెమ్మలకు ఏకంగా 31.19 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సరికొత్త చరిత్ర సృష్టించారని, ఇది చరిత్ర ఎరుగని సాహసమని రాజ్యసభ సభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా శుక్రవారం ఆయన పలు అంశాలపై తనదైన శైలిలో స్పందించారు. మొత్తం 31.19 లక్షల ఇళ్ల పట్టాల్లో 22.25 లక్షల గృహ నిర్మాణాలు జరిగినట్లు తెలిపారు. ఇంటి స్థలం, ఇల్లు రూపంలో ప్రతి నిరుపేద కుటుంబానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రూ.20 లక్షల వరకు విలువైన ఆస్తిని అందించారని అన్నారు. నవరత్నాలు పథకం కింద పేదలందరికీ ఇళ్లు అందించడంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్ల లబ్దిదారులు మిక్కిలి కృతజ్ఞతా భావంతో ఉన్నారని తెలిపారు.
సామాజిక న్యాయానికి చిహ్నంగా అంబేద్కర్ విగ్రహం : విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేసిన భారతరత్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ అద్భుతమైన విగ్రహం సామాజిక న్యాయానికి చిహ్నంగా విరాజిల్లుతుందని విజయసాయి రెడ్డి అన్నారు. ఈ విగ్రహం ఆయన వారసత్వాన్ని, అతని స్ఫూర్తిదాయకమైన ఆదర్శాలను అనుసరిస్తున్న జగన్ ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుందని అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన బాటలో సీఎం జగన్ కొనసాగిస్తున్న పాలన ఫలితంగా దళితులు, బడుగు బలహీన వర్గాల ప్రజలు విద్య, ఆర్థిక, రాజకీయ సాధికారతతో రాణిస్తున్నారని అన్నారు. దేశంలోనే అద్భుత కళాఖండంగా రూపొందించిన సామాజిక న్యాయ మహా శిల్పం (అంబేద్కర్ భారీ విగ్రహం) సీఎం జగన్ శుక్రవారం ఆవిష్కరించి జాతికి అంకితం చేశారని అన్నారు.
విమానాశ్రయాల్లో మౌలిక సదుపాయాలు పెంచాలి : దేశవ్యాప్తంగా విమానాశ్రయ మౌలిక సదుపాయాలను పెంచాల్సిన తక్షణ ఆవశ్యకత స్పష్టంగా కనిపిస్తోందని వెయిటింగ్ సమయాన్ని పొడిగించడం, ఆహారం, ప్రయాణ సౌకర్యాల కోసం అధిక ఛార్జీలు లక్షలాది మంది విమాన ప్రయాణికులపై ప్రభావం చూపిస్తున్నాయని అన్నారు. ప్రయాణీకులు సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు చొవర చూపాలని విమానయాన శాఖ మంత్రి జేఎం సింధియాకు అభ్యర్దిస్తున్నానని విజయసాయి రెడ్డి అన్నారు.