విజయవాడ : టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీ పంచన చేరిన విజయవాడ ఎంపీ కేశినేని నానీపై టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా ధ్వజమెత్తారు. టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు పక్కన నిలబడ్డ వ్యక్తి, నేడు వైసీపీ ఛోటా నాయకుల భజన చేసే దుస్థితికి వచ్చాడని విమర్శించారు. కల్తీ మద్యం క్వార్టర్ రూ.200లకు ఎందుకు అమ్ముతున్నారో, లారీ ఇసుక రూ.12 వేలు అంతకుమించి అమ్మడంపై కేశినేని నానీ మాట్లాడాలని నిలదీశారు. తెలంగాణలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి రూ.150 కోట్లు ఖర్చయితే, జగన్ రెడ్డి సర్కార్ రూ.400 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టిందో నానీ చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో నానీపై టీడీపీ అభ్యర్థి 2 లక్షల మెజారిటీతో గెలవడం ఖాయమని నాగుల్ మీరా స్పష్టం చేశారు. కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణంలో నానీ పాత్ర చంద్రబాబుకి కాగితాలు అందించడమేనని అన్నారు. తెలుగుదేశంలో ఉన్నప్పుడు కేశినేని నానీకి మోసగాడిగా, ద్రోహిగా కనిపించిన జగన్ రెడ్డి, నేడు గొప్ప వ్యక్తిగా కనిపించడం హాస్యాస్పదమని అన్నారు. పీఆర్పీ, టీడీపీల మాదిరే త్వరలోనే వైసీపీ కూడా నానీని భరించలేమనే స్థితికి వస్తుందని, నానీకి నైతిక విలువలు లేవు అనడానికి అతను చేస్తున్న వ్యాఖ్యలే నిదర్శనమని నాగుల్ మీరా పేర్కొన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే మొదట ప్రారంభమయ్యేది రాజధాని పనులేనని నానీ తెలుసుకోవాలన్నారు.