తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
దావోస్ : ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుని నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. సరైన ప్రణాళిక, అమలు కోసం తెలంగాణలోని నాలుగు కోట్ల ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డులు తయారు చేస్తున్నామని, వాటికి డేటా సెక్యూరిటీ, ప్రైవసీ కల్పిస్తామని సీఎం చెప్పారు. ప్రపంచ ఆర్థిక ఫోరం వార్షిక సదస్సులో భాగంగా ‘హెల్త్ కేర్ డిజిటలీకరణ’ అంశంపై జరిగిన చర్చలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన నాకు పేదల సమస్యలు తెలుసు. నాణ్యమైన ఆరోగ్య సేవలు అందక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉత్తమ ఆరోగ్య సేవలు అందించడమే నా లక్ష్యం. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద పేదలకు ఏటా రూ.10 లక్షల వరకు వైద్య బీమా సదుపాయం కల్పిస్తున్నాం. హెల్త్ కేర్, సాఫ్ట్‌వేర్‌కు రాజధాని హైదరాబాద్ నగరం. వ్యాక్సిన్లు, ఔషధాల్లో 33 శాతం హైదరాబాద్‌లోనే ఉత్పత్తి అవుతున్నాయి. తెలంగాణ అంటేనే ఒక ప్రభావం’’ అని రేవంత్ రెడ్డి అభివర్ణించారు. హైదరాబాద్‌లో ఫిబ్రవరిలో జరగనున్న బయో ఏషియా సదస్సుకు పారిశ్రామికవేత్తలందరూ రావాలని సీఎం ఆహ్వానించారు.