సిమ్లా : హిమాచల్‌ప్రదేశ్ ప్రజలు మళ్లీ బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. హిమాచల్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. హిమాచల్‌ప్రదేశ్ ప్రజలు మళ్లీ బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధితో కూడిన సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన అవసరముందని చెప్పారు. హిమాచల్‌ప్రదేశ్ శాసనసభకు నవంబరు 12న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘‘ హిమాచల్‌ప్రదేశ్‌లో ఈసారి జరుగుతున్న ఎన్నికలు ఎంతో ప్రత్యేకమైనవి. మీరు వేయబోయే ఓటు వచ్చే ఐదేళ్ల కోసం కాదు. 25 సంవత్సరాల రాష్ట్ర అభివృద్ధికి మార్గం సుగమం చేస్తుంది. ఓటు వేసేముందు దీనిని గుర్తు పెట్టుకోవాలని సురేందర్‌నగర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మోడీ వ్యాఖ్యానించారు. ఇటీవలే భారత్ 75 వసంతాల వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించిందని చెబుతూ మరో 25 ఏళ్లు గడిస్తే హిమాచల్‌ప్రదేశ్ కూడా 100 ఏళ్లు పూర్తి చేసుకుంటుందని ఆయన గుర్తు చేశారు. అందువల్ల రానున్న 25 ఏళ్లు రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కీలకమని ఆయన వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు హిమాచల్ అభివృద్ధికి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదని మోదీ విమర్శించారు. హిమాచల్ చిన్నరాష్ట్రమైనందున దానిని కాంగ్రెస్ పట్టించుకోలేదని, వారి కుసంస్కారానికి ఇదే నిదర్శనమని అన్నారు. వరుసగా రెండుసార్లు ఒకే పార్టీకి అధికారం అప్పగించే చరిత్ర హిమాచల్‌ప్రదేశ్‌కు లేదని గుర్తు చేసిన మోడీ ఈసారి మాత్రం ఫలితం అందుకు భిన్నంగా వస్తుందని అన్నారు. కాంగ్రెస్ స్కామ్‌ల పార్టీగా గుర్తింపు తెచ్చుకుందని మోడీ ఆరోపించారు. ఆ పార్టీ స్కామ్‌లు రక్షణరంగం నుంచే మొదలయ్యాయని విమర్శించారు. రక్షణ సంబంధిత ఒప్పందాలు జరిగిన ప్రతిసారి వేల కోట్ల కమిషన్లు దండుకునేదని ఎద్దేవా చేశారు. హిమాచల్‌లో ఈసారి కూడా డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం చేశారు.