ఏపీలో 4.07 కోట్ల మంది ఓటర్లు
22న తుది జాబితా విడుదల
ఓటర్లు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవాలి
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్
విజయవాడ : ఎన్నికల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సీఈసీ) రాజీవ్ కుమార్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. బుధవారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహిస్తాం. ఓటర్ల జాబితాలో మార్పులపై కొన్ని పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. పారామిలిటరీ బలగాలతో ఎన్నికలు నిర్వహించాలని ఓ పార్టీ కోరింది. ఎన్నికల నేపథ్యంలో తొలుత ఆంధ్రప్రదేశ్‌ను సందర్శించాం. మంగళవారం విజయవాడలో రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాం. ఏపీ, తెలంగాణలో రెండు చోట్లా కొందరు ఓట్లు నమోదు చేసుకున్న అంశాన్ని ఓ పార్టీ ప్రస్తావించింది. ఎన్నికల్లో ధన ప్రభావాన్ని నియంత్రించాలని కొన్ని పార్టీలు కోరాయి. రాష్ట్రంలో మొత్తం 4.07 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో మహిళలు 2.07 కోట్లు, పురుషులు 1.99 కోట్ల మంది ఉన్నారు. మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండటం శుభ పరిణామం. ఇంటి వద్ద నుంచి ఓటు వేసేందుకు 5.8 లక్షల మందికి అవకాశముంది. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య 7.88 లక్షలు. వందేళ్లు దాటిన వృద్ధులు 1,174 మంది ఉన్నారు. ఈనెల 22న తుది జాబితా విడుదల చేస్తామని తెలిపారు.
రెండు చోట్ల ఓట్లు ఉంటే క్రిమినల్ చర్యలు తప్పవు : ఎవరైనా రెండు ప్రాంతాల్లో ఓట్లు కలిగి ఉంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సీఈసీ) రాజీవ్ కుమార్ హెచ్చరించారు. 2024 పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు సంబందించిన మొదటి సమావేశాన్ని విజయవాడలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సన్నద్ధతపై స్టేక్ హోల్డర్స్ అందరితో సమావేశాలు నిర్వహించామన్నారు. ఎన్నికలను పూర్తి పారదర్శకంగా నిర్వహించేలా ముందుకెళ్తున్నామని చెప్పారు. వివిధ రాజకీయ పార్టీల నుంచి అనేక ఫిర్యాదులు అందాయని, ఓటరు జాబితాలో తొలగింపులు, చేర్పులు విషయంలో చర్యలు తీసుకోవాలని కోరారన్నారు. ఎన్నికలు పూర్తి పారదర్శకంగా జరిగేలా చూడాలని అన్ని శాఖల అధికారులకూ అదేశాలిచ్చామని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 4.07 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని,వారిలో పురుషులు 1.99 కోట్లు, మహిళలు 2.07కోట్లు ఉన్నారని వివరించారు. ఎస్ ఎస్ ఆర్ విడుదలకు ముందు ఎక్కడైనా ఓటర్ గా రిజిస్టర్ చేసుకోవచ్చని సూచించారు. ఎన్నికల్లో ఓటర్లు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.