సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సమన్వయ సమావేశం
హైదరాబాద్ : ఈ నెల 18 నుంచి 21 వరకు బేగంపేట విమానాశ్రయంలో నిర్వహించనున్న వింగ్స్ ఇండియా 2024 కార్యక్రమ ఏర్పట్ల పై భారత ప్రభుత్వ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఫిక్కీ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మంగళవారం సచివాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. వింగ్స్ ఇండియా 2024 ఈవెంట్‌ను సజావుగా నిర్వహించేందుకు జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షీంచారు. వివిధ తయారీదారులు, అనుబంధ విమానయాన సేవలు, అనుబంధ విభాగాలు, పరిశ్రమలు, పర్యాటక రంగాలకు చెందిన కొన్ని కొత్త తరం విమానాల ప్రదర్శనతో పాటు వివిధ దేశాలు, ఇతర ఉన్నత స్థాయి ప్రముఖుల భాగస్వామ్యంతో ఈ సంవత్సరం ఈవెంట్‌ను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు చీఫ్ సెక్రటరీ తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమం నిర్వహించడానికి అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రకమానికి చివరి రెండు రోజుల్లో లక్ష మందికి పైగా సందర్శకులు వచ్చే అవకాశం ఉన్నందున అందుకు అవసరమైన పార్కింగ్ సదుపాయం కల్పించాలన్నారు. బేగంపేట విమానాశ్రయ పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమ పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్య పనుల పై శ్రద్దవహించాలని జీ హెచ్ ఏం సి అధికారులను ఆదేశించారు. పరిసరాల్లోని సాధారణ ప్రజలు రోడ్లపై చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సంక్రాంతి పండుగ సమయం కావడంతో గాలిపటాలు ఎగురవేస్తుంటారు కనుక ప్రదర్శనకు వచ్చే అంతర్జాతీయ విమానాలకు ఆటంకం కలిగించే అవకాశం ఉన్నందున రెండు రోజుల ముందు అంటే 16వ తేదీ నుండి విమానాశ్రయ ప్రాంతం చుట్టూ గాలిపటాలు ఎగురవేయడం నిషేదించాలని అధికారులను ఆదేశించారు.
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ శ్రీ అసంగ్బా చుబా అవో మాట్లాడుతూ, ద్వైవార్షిక ఈవెంట్ రాష్ట్ర ప్రభుత్వం తన అభివృద్ధి కార్యకలాపాలను ప్రదర్శించడానికి మంచి అవకాశాన్ని కల్పిస్తుందని పేర్కొన్నారు. ప్రయాణం, పర్యాటకం, స్టార్టప్‌లు, నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలతో పాటు విమానయాన రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు వింగ్స్ ఇండియా 2024 ఈవెంట్ ఒక అవకాశం అవుతుందన్నారు. ఆర్అండ్బీ ముఖ్య కార్యదర్శి శ్రీనివాస్‌రాజు, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, డైరెక్టర్ ఫిక్కీ మనోజ్, ఏవియేషన్ డైరెక్టర్ భరత్‌రెడ్డి, బేగంపేట ఎయిర్పోర్ట్ డైరెక్టర్ పీకే హాజారె ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.