రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
హైదరాబాద్ : సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ప్రకారం ఏవిధమైన ముందస్తు అనుమతులు లేకుండా నిర్వహించిన ఫార్ములా ఈ-రేస్ ఒప్పందం, నిర్వహణ పై న్యాయపరంగా ముందుకు వెళ్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సచివాలయంలోని మీడియా సెంటర్ లో పాత్రికేయుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడారు. హైదరాబాద్ లో గతేడాది నిర్వహించిన ఫార్ములా ఈ రేసింగ్ ఒప్పందానికి సంబంధించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రస్తావిస్తూ, ఆ ఈవెంట్ అనేది ఓ కంపెనీకి లబ్ధి చేకూర్చడం కోసమే పెట్టారని ఆరోపించారు. ఈ రేస్ వలన హైదరాబాద్ కు ఏవిధమైన లాభం లేదని, పైగా ప్రభుత్వ నిధులను అప్పనంగా ఒక ప్రయివేటు సంస్థకు కట్టబెట్టారని అన్నారు. గత ప్రభుత్వం ఏవిధమైన విధి విధానాలు పాటించకుండా, నిర్వహణ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వంలో ఏవిధమైన ముందస్తు ఒప్పందం జరుపకుండా, వ్యాపార సూత్రాలకు విరుద్ధంగా ఓ కంపెనీకి లబ్ధి చేయడం కోసమే ఫార్ములా రేసు నిర్వహించారని అన్నారు. ఈ రేసు నిర్వహణకు కు రూ.110 కోట్లు అక్రమంగా చెల్లించారని అన్నారు. తాము ఫార్ముల ఈ-రేసు రద్దు చేయడంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని భట్టి విక్రమార్క అన్నారు. తమ ప్రభుత్వంపై ప్రజలకు ఎన్నో ఆశలు ఉన్నాయని, ప్రతిపైసా ప్రజల అవసరాల కోసం మాత్రమే తాము ఖర్చు చేస్తామని వివరించారు.
సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ప్రకారం ఫార్ములా ఈ-రేస్‌కు అనుమతి లేదని భట్టి విక్రమార్క అన్నారు. వాళ్లు ఎవరో హైదరాబాద్‌కు వచ్చి వెళ్లడానికి రూ.100 కోట్లు కట్టాలా? అని ప్రశ్నించారు. ఇది బిజినెస్ రూల్స్ కు విరుద్ధమైనదని భట్టి అన్నారు. ప్రతి పైసా రాష్ట్ర ప్రజల అవసరాల కోసం ఖర్చు చేస్తామని స్పష్టం చేశారు. ఫార్ములా ఈ రేస్ నిర్వహించడం వల్ల రాష్ట్రానికి ఎలాంటి ఆదాయం ఉండదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఒప్పందం ప్రకారం ప్రభుత్వం ట్రాక్ సదుపాయం కల్పించాలని అన్నారు. ప్రజా పాలన అభయ హస్తం దరఖాస్తుల స్వీకరణ రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి చిన్న సంఘటన లేకుండా చాలా పకడ్బందీగా నిర్వహించామని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే మహాలక్ష్మి పథకం ప్రారంభించామన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 6.50 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం లబ్ధి పొందారని వివరించారు. ప్రజా భవన్ లో ఎవరైనా నన్ను ప్రతి రోజు ఉదయం 8.30 నుంచి 9.30 వరకు కలవొచ్చుని స్పష్టం చేశారు. సంపద సృష్టిస్తామని, సృష్టించిన సంపదను ప్రజలకు పంచుతామని డిప్యూటీ సి.ఎం తెలిపారు.