అమరావతి: ఈ ఏడాది ఓటర్ల తుది జాబితా తయారీలో భాగంగా 2023 డిసెంబర్ 9 వరకు వచ్చిన దరఖాస్తులను పరిష్కరించామని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముకేశ్ కుమార్ మీనా (Mukesh Kumar Meena) తెలిపారు..
ఆ తర్వాత వచ్చిన దరఖాస్తులను జనవరి 12లోపు పరిష్కరిస్తామని చెప్పారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గందరగోళం లేకుండా ఓటరు జాబితాను సవరించేందుకు కార్యాచరణ చేపట్టామని తెలిపారు.
”మృతి చెందిన ఓటర్లు, డూప్లికేట్ కేసులు, ఓటు బదిలీ దరఖాస్తులను ఇంటింటి సర్వే నిర్వహించి పరిష్కరించాం. అన్ని రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో 5,64,819 పేర్లను అనర్హులుగా తేల్చాం. కొన్ని నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలో ఆన్లైన్లో దరఖాస్తులు చేస్తున్నారన్న ఫిర్యాదులు వచ్చాయి. కాకినాడ నగరంలో ఫాం 7 ద్వారా గంపగుత్తగా ఓటర్లను చేరుస్తున్న 13 మంది, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో దురుద్దేశ పూర్వకంగా దాఖలు చేసిన ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాం..
చంద్రగిరి నియోజకవర్గంలో ఐపీసీ, ఐటీ చట్టాల కింద కేసులు పెట్టాం. అక్కడ ఉల్లంఘనలకు పాల్పడిన 24 మంది బీఎల్వోలపై చర్యలు తీసుకున్నాం. పర్చూరులో 10 ఎఫ్ఐఆర్లను నమోదు చేశాం. జీరో డోర్ నంబర్లు, ఒకే ఇంటిలో 10 మంది కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న కేసుల్లో 97 శాతం మేర తనిఖీలు పూర్తి చేసి ఓటర్ల జాబితాను సవరించాం. ఒకే కుటుంబంలోని ఓటర్లు వేర్వేరు పోలింగ్ కేంద్రాలకు మారిపోయిన ఘటనలు విశాఖ, ఎన్టీఆర్ జిల్లాల్లో నమోదయ్యాయి” అని ముకేశ్‌కుమార్ మీనా వివరించారు..