బాలాయపల్లి : మండలంలో ఉన్న 72 అంగనవాడి కేంద్రాలకు బియ్యం చేరవేయాల్సిన బాధ్యత వీఆర్వోలపై ఉందని బాలాయపల్లి తహసీల్దార్ శ్రీనివాసులు ఆదేశించారు. శుక్రవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో అంగన్వాడీ కేంద్రాలకు బియ్యం చేరవేసేందుకు వీఆర్వోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతి అంగన్వాడి కేంద్రంలో మధ్యాహ్న పథకం భోజనం నిర్వహించేందుకు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అంగన్వాడీ కేంద్రంలో బియ్యం కొరత లేకుండా చూసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లలు, గర్భవతులు బాలింతల సంఖ్యను బట్టి వారికి అందించాల్సిన రేషన్ సక్రమంగా అందించాలని తెలిపారు. ఈ విషయంలో వీఆర్వోలు బాధ్యతగా పనిచేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్, పూర్ణ డిప్యూటీ తహసీల్దార్ శిరీష వీఆర్వోలు, తదితరులు పాల్గొన్నారు.
ఫోటో:- మాట్లాడుతున్న తహసీల్దార్