న్యూఢిల్లీ : ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ స్వాతి మాలీవాల్ రాజ్యసభకు వెళ్లనున్నారు. ఆమెను ఎగువ సభకు నామినేట్ చేస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఈశాన్య రాష్ట్రం సిక్కింలో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు జనవరి 19న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ముగ్గురు అభ్యర్థులను ఆమ్ ఆద్మీ పార్టీ నామినేట్ చేసింది. ఇందులో ఒకరు ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ స్వాతి మాలీవాల్. ఆమెను తమ అభ్యర్థిగా నామినేట్ చేస్తున్నట్లు పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ శుక్రవారం వెల్లడించింది. ఢిల్లీలోని మూడు రాజ్యసభ స్థానాలకు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు సంజయ్ సింగ్, సుశీల్ కుమార్ గుప్తా, నారాయణ్ దాస్ గుప్తా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరి ఆరేళ్ల పదవీకాలం ఈ నెల 27తో ముగియనుంది. దీంతో వీటికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ క్రమంలోనే సంజయ్ సింగ్, నారాయణ్ దాస్ గుప్తాను వరుసగా రెండోసారి నామినేట్ చేస్తున్నట్లు ఆప్ తెలిపింది. ఇక, సుశీల్ కుమార్ గుప్తా ఈ ఏడాది చివర్లో జరగబోయే హరియాణా అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించాలని నిర్ణయించుకోవడంతో ఆ స్థానంలో స్వాతి మాలివాల్‌ను పార్టీ ఎంపిక చేసింది. ఆమెను రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించింది.
సంజయ్ సింగ్ నామినేషన్‌కు కోర్టు ఓకే : సంజయ్ సింగ్ ప్రస్తుతం మనీలాండరింగ్ కేసులో అరెస్టయి జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో తాను రెండోసారి రాజ్యసభకు వెళ్లేందుకు వీలుగా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రీనామినేషన్ పత్రాలపై సంతకం చేసేందుకు తనను అనుమతించేలా జైలు అధికారులను ఆదేశించాలని కోరారు. ఇందుకు కోర్టు అంగీకరించింది. ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ జనవరి 2వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసింది. 9వ తేదీలోగా నామినేషన్ పత్రాలు దాఖలు చేయాలి. ఈ నెల 19న ఎన్నికలు జరగనున్నాయి.