క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యేల క్యూ
అసంతృప్తులను బుజ్జగిస్తున్న సీఎం జగన్
బుజ్జగించేందుకు రంగంలోకి సజ్జల, విజయసాయిరెడ్డి
ఇన్చార్జిల మార్పులపై సీఎం వైఎస్ జగన్ కసరత్తు
గుంటూరు : అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం జిల్లాల్లో కొత్త ఇన్‌ఛార్జిలను నియమిస్తోంది. పలు నియోజకవర్గాలల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానంలో కొత్తగా ఇన్చార్జిలను ప్రకటిస్తుడడంతో పలువురు ఎమ్మెల్యేలు హైకమాండ్‌పై తిరుగుబావుటా ఎగురువేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో టికెట్ కేటాయించని ఎమ్మెల్యేలు తాడేపల్లి ప్యాలస్‌కి రావాలని అధిష్ఠానం ఆదేశించింది. వీరిని ఎలాగైనా నచ్చజేప్పెందుకు పార్టీ అగ్ర నేతలు ప్రయత్నిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఆయా ఎమ్మెల్యేల గెలుపు కోసం పనిచేయాలని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైనా పదవీ కట్టబెడతామని హై కమాండ్ వారిని బుజ్జగిస్తోంది. వీరు ధిక్కార స్వరం వినిపిస్తే పార్టీ నష్టపోయే ప్రమాదముందని గ్రహించిన సీఎం జగన్, పార్టీ అగ్ర నేతలు రంగంలోకి దిగి వారిని శాంతపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. అధిష్ఠానం పిలుపురావడంతో శుక్రవారం పలువురు ఎమ్మెల్యేలు తాడేపల్లి ప్యాలస్‌కు క్యూ కట్టారు. గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు సీఎం జగన్‌తో కాసేపటి క్రితమే సమావేశమయ్యారు. అసంతృప్తితో ఉన్న అన్నా రాంబాబును పార్టీ పెద్దలు బుజ్జగించే ప్రయత్నం చేశారు. గిద్దలూరు ఇన్చార్జిగా అన్నా రాంబాబును తప్పించి మరొకరికి ఇచ్చేందుకు వైసీపీ సమాలోచనలు చేస్తోంది. వైసీపీపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎన్నికల్లో పోటీ చేయనని అన్నా రాంబాబు ప్రకటించారు.
తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలకు పిలుపు వచ్చింది. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌తో మంత్రి గుమ్మనూరు జయరాం భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో రాబోయే ఎన్నికలపై చర్చించినట్లు సమాచారం. అలాగే తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి నరసారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి , దర్శి ఎమ్మెల్యే మద్ది శెట్టి వేణుగోపాల్, పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు వచ్చారు. కాగా మరోసారి సీఎం క్యాంపు కార్యాలయానికి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వచ్చారు. పార్టీ కీలక నేతలతో చర్చించి ఇన్చార్జిలను సీఎం జగన్ ఖరారు చేస్తున్నారు. అసంతృప్తితో ఉన్న నేతలను బుజ్జగించేందుకు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి రంగంలోకి దిగారు. పలు నియోజకవర్గాల ఇన్చార్జిల మార్పులపై సీఎం వైఎస్ జగన్ కసరత్తు చేస్తున్నారు.