విజయవాడ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు పెడుతున్నాయని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. శనివారం 1 వ డివిజన్ 3 వ వార్డు సచివాలయం పరిధిలో స్థానిక కార్పొరేటర్ ఉద్ధంటి సునీతతో కలిసి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. మధ్యకట్టలో విస్తృతంగా పర్యటించి 322 గడపలను సందర్శించారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి గ్రీవెన్స్ స్వీకరించారు. పలువురు అర్జీదారులకు మంజూరైన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. రేవు దగ్గర అపరిశుభ్రంగా ఉండడాన్ని గమనించిన ఆయన వెంటనే కాలువలో తూటికాడ, చెత్తను తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. పర్యటనలో భాగంగా రేషన్ వాహనం ద్వారా సరుకుల పంపిణీని పరిశీలించారు. వాహనాన్ని ప్రతి ఇంటికి తీసుకువెళ్లి గుమ్మం వద్దకే సరకులను అందించాలని తెలిపారు. అనంతరం స్థానిక 207 అంగన్వాడీ కేంద్రాన్ని మల్లాది విష్ణు సందర్శించారు. చిన్నారులకు క్రమం తప్పకుండా పోషకాలతో కూడిన ఆహారాన్ని అందజేయాలని సిబ్బందికి సూచించారు. మరోవైపు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. గుణదల ఆర్వోబీ పనులను వీలైనంత త్వరగా పూర్తిచేయాలనే కృతనిశ్చయంతో పనిచేస్తున్నట్లు వెల్లడించారు. స్టేజ్ -2 పనులకు సంబంధించి నాబార్డు ద్వారా సుమారు రూ. 82 కోట్ల నిధులు మంజూరు కాగా.. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు.