విజయవాడ :భాషాభిమానులు ఉన్నంత వరకూ తెలుగు భాష అజరామరం అని ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ ఎవి శేషసాయి వ్యాఖ్యానించారు. తాపీ ధర్మారావు వేదిక ఆధ్వర్యంలో స్థానికంగా జరిగిన
తాపీ ధర్మారావు పురస్కారం 2022 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జస్టిస్ ఎవి శేషసాయి పురస్కార గ్రహీత ప్రముఖ కార్టూనిస్ట్ సరసిని దుశ్శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పురస్కారం ఆయా పురస్కార గ్రహీతల బాధ్యత సమాజం పట్ల రెట్టింపవుతుందన్నారు. తాపీ పట్టుకుని సమాజాన్ని కొత్తగా నిర్మించిన జర్నలిస్ట్, సినీ రచయిత, భాషావేత్త తాపీ ధర్మారావు గారి పేరిట ప్రతి ఏడూ పురస్కారం ఇవ్వడం ప్రశంసనీయమన్నారు. సరసి వంటి భాషాసేవకుడైన సరసికి అందించడం అభినందనీయమన్నారు. మాజీ ఉప సభాపతి డా మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ, తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తెలుగు భాషకు ప్రాచీన హోదా విషయంలో అసెంబ్లీలో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు.
సభకు అధ్యక్షత వహించిన అమ్మనుడి సంపాదకులు , తెలుగు భాషోద్యమ సమాఖ్య గౌరవాధ్యక్షులు సామల రమేష్ బాబు మాట్లాడుతూ తెలుగు వ్యవాహార భాషోద్యమ నిర్మాత గిడుగు రామ్మూర్తి పంతులు శిష్యులుగా తాపీ ధర్మారావు గిడుగు వారి బాటను అనుపరించి తెలుగు వ్యవహార భాషగా పత్రికలలో ప్రవేశపెట్టిన ఆద్యులు తాపీ ధర్మారావు అని గుర్తుచేశారు.గతంలో పలువురు జర్నలిస్ట్ లకు ఈ పురస్కారం అందించినట్లు రమేష్ బాబు తెలిపారు. ఈ సభలో తెలుగు భాషోద్యమ సమాఖ్యజాతీయ అధ్యక్షులు ప్రొఫెసర్ గారపాటి ఉమామహేశ్వరరావు, కార్టూనిస్ట్ బాచి తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో భాషాభిమానులు,కార్టూనిస్టులు తదితరులు పాల్గొన్నారు.