అమరావతి : బీసీలకు అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పించి ఆధునిక అభివృద్ధిలో
వారి వాటా వాళ్ళకే దక్కాలని సిఫార్సు చేసిన ఆధునిక బీసీల యుగకర్త బీపీ మండల్
అని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి అన్నారు. బీసీల అభివృద్ధికై
మండల్ రిపోర్టు ఒక బీసీ రాజ్యాంగంగా, బీసీల అభివృద్ధి రాజ్యాంగంగా
గుర్తించాలని అన్నారు దుండ్ర కుమారస్వామి. ఓబీసీలకు మండల్ ద్వారానే ఒక
గుర్తింపు దొరికింది. రిజర్వేషన్ల రూపంలో విద్య, ఉద్యోగ రంగాలలో ప్రవేశించడం
మొదలైంది. కానీ మండల్ చేసిన 40 సిఫారసులలో రిజర్వేషన్ అనే ఒకే ఒక్క అంశం ఉద్యమ
రూపంలో ముందుకు వచ్చింది. మిగిలిన సిఫారసులను కేంద్ర ప్రభుత్వంప
పట్టించుకోవడం లేదని దుండ్ర కుమారస్వామి అన్నారు.
జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో బీపీ మండల్ జయంతిని ఘనంగా నిర్వహించారు. బిహార్లో
యాదవ వర్గంలో జన్మించి సోషిత్ దళ్ అనే పార్టీని వెనుకబడిన, దళిత వర్గాల కోసం
స్థాపించి బిహార్లో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని నెలకొల్పిన మహనీయుడు బీపీ
మండల్. సమాజంలో బీసీలు ఎదుర్కొంటున్న వివక్షను ప్రశ్నించి, ముఖ్యమంత్రి
పీఠాన్ని సైతం వదులుకున్న వెనుకబడిన వర్గాల పక్షపాతి ఆయన అని అన్నారు. బీసీల
అభ్యున్నతికి విలువైన సూచనలు చేసిన బీపీ మండల్ బీసీల మదిలో ఎప్పటికీ
నిలిచిపోతారని దుండ్ర కుమారస్వామి అన్నారు. కులాలుగా చీలిపోయి ఉన్న బీసీలు
ఏకమై, పార్టీలకు, సంఘాలకు అతీతంగా ఐక్యమై లక్ష్యాలను సాధించుకోవాలని దుండ్ర
కుమారస్వామి పిలుపునిచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు సముచిత
సీట్లు కేటాయించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు దుండ్ర కుమారస్వామి. ఈ
కార్యక్రమంలో సుభాష్, రంగారెడ్డి జిల్లా యూత్ అధ్యక్షుడు సాయి యాదవ్, ప్రసాద్
ఆచార్య, నాగరాజు , ప్రదీప్ తదితర రాష్ట్ర స్థాయి యువత పాల్గొన్నారు.