విజయవాడ : రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారంలోకి వచ్చేది వైఎస్
జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వమేనని ప్లానింగ్
బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వైనాట్ 175
నినాదంతో సత్యనారాయణ పురంలోని గాయత్రీ కన్వెన్షన్ సెంటర్ నుంచి ఎమ్మెల్యే
ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జనసంద్రంగా సాగిన ర్యాలీ ఆసాంతం
జైజగన్ – జైజై జగన్ నినాదాలతో హోరెత్తింది.
ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని
ఎప్పటికప్పుడు రెట్టింపు చేసుకుంటూ రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి
సుపరిపాలన అందిస్తున్నారన్నారు. అది చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు
నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. మురీముఖ్యంగా నారా లోకేష్
కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, 11 అంశాలను ప్రస్తావిస్తే సమాధానం
చెప్పకుండా మాట దాటవేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పైగా విజయవాడలో
మాట్లాడే ధైర్యం లేక రెండు రోజుల తర్వాత గన్నవరంలో మాట్లాడటం విడ్డూరంగా
ఉందన్నారు. చేసిన అభివృద్ధిపై చెప్పుకోవడానికి ఏమీలేక నోటికొచ్చినట్లు
మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులను
జంతువులతో పోల్చడాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. నారా లోకేష్ లా
దిగజారి మాట్లాడటం తమకు చేతకాదని మల్లాది విష్ణు అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్ రెడ్డితో ఒంటరిగా యుద్ధం చేసే సత్తాలేక పొత్తుల కోసం
వెంపర్లాడుతున్న మీరా ఈ ప్రభుత్వాన్ని విమర్శించేదని నిప్పులు చెరిగారు. 100
రోజుల్లో పాలనలో మార్పులు తీసుకొస్తామని చెబుతున్న నారా లోకేష్ అధికారంలో ఉన్న
గత ఐదేళ్లు ఏం వెలగబెట్టారని ప్రశ్నించారు. పైగా మా పథకాలను కాపీ కొడుతూ
ప్రతిసవాళ్లు విసరడం సిగ్గుచేటన్నారు. అమ్మఒడి ఇస్తేనే రాష్ట్రం అప్పులపాలు
అయిపోతోందని గగ్గోలు పెట్టిన టీడీపీ నేతలు రెట్టింపు సంక్షేమాన్ని ఏవిధంగా
ఇస్తారో సమాధానం చెప్పాలని మల్లాది విష్ణు అన్నారు. రాష్ట్రంలో కరెంట్ ఛార్జీల
పాపం మీది కాదా..? అని సూటిగా ప్రశ్నించారు.
బహిరంగ చర్చకు సిద్ధం
తెలుగుదేశం పార్టీ ఒక అబద్దాల ఫ్యాక్టరీ అని నారా లోకేష్ మాటలతో మరోసారి
రుజువైందని మల్లాది విష్ణు అన్నారు. ప్రభుత్వ భూములలో నివసిస్తున్న ప్రజలకు
శాశ్వత భూహక్కు కల్పించామని లోకేష్ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. దశాబ్దాలుగా
నగర ప్రజలు ఎదుర్కొంటున్న ఇళ్ల రిజిస్ట్రేషన్ సమస్యకు శాశ్వత పరిష్కారం
చూపుతూఈ ప్రభుత్వంలో జీవోలు తీసుకురావడం జరిగిందన్నారు. దీనిపై ఎక్కడైనా
బహిరంగ చర్చకు తాము సిద్ధమని సవాలు విసిరారు. ఐదేళ్లు అమరావతి నామ జపం తప్ప
నగర ప్రజలకు కావలసిన కనీస మౌలిక సదుపాయాలను కల్పించడంలో గత పాలకులు పూర్తిగా
వైఫల్యం చెందారని మల్లాది విష్ణు ఆరోపించారు. పైగా వరద కాలవల నిర్మాణంలోనూ
భారీ అవినీతికి పాల్పడ్డారని, రూ. 500 కోట్లు ఖర్చుపెట్టి సగం సగం పనులు చేసి
వదిలేశారని విమర్శించారు. 2014-19., 2019-23 మధ్య కాలంలో జరిగిన అభివృద్ధిపై
ఎప్పుడైనా, ఎక్కడైనా బహిరంగ చర్చకు తాము సిద్ధమని సవాలు విసిరారు.
టీడీపీ ఇన్ సైడ్ ట్రేడింగ్ కి పాల్పడితే.. మేము చప్పట్లు కొట్టాలా?
తెలుగుదేశం పార్టీని 23 సీట్లతో ప్రజలు నడిరోడ్డుపై నిలబెట్టినా టీడీపీ నేతల
తీరులో మార్పు రాలేదని మల్లాది విష్ణు అన్నారు. అధికారాన్ని ప్రజల కోసం
ఏవిధంగా వినియోగించాలో చంద్రబాబు, గత పాలకులకు ఏమాత్రం తెలియదని విమర్శించారు.
అమరావతిని నెత్తిన పెట్టుకుని ఉమ్మడి కృష్ణా జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యం
చేసిన గత పాలకులకు ఈ ప్రాంతంలో పర్యటించే నైతిక హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు.
మూడు రాజధానులలో అమరావతి కూడా ఉందనే విషయాన్ని మరిచిపోయి నారా లోకేష్
మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా ఈ
ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. ఐదేళ్లు అధికారంలో
ఉండి అమరావతిలో కనీసం పునాదులు కూడా వేయలేకపోయినందుకు తెలుగుదేశం నాయకులు
సిగ్గుపడాలని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమరావతి జరిగిన
అక్రమాలు అన్నీఇన్నీ కావని ఎమ్మెల్యే విమర్శించారు. టీడీపీ నేతలు ఇన్ సైడర్
ట్రేడింగ్ కి పాల్పడితే వందిమాగదులందరికీ భూములు దోచిపెడితే మేమంతా చప్పట్లు
కొట్టాలా..? అని సూటిగా ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ హైటెక్ సిటీ పరిసర
ప్రాంతాలలో ఇలాగే చంద్రబాబు వందిమాగదులందరూ భూములు కొన్నారని గుర్తుచేశారు.
అసెంబ్లీ సాక్షిగా అమరావతిలో జరిగిన అవినీతి బాగోతాన్ని ఈ ప్రభుత్వం
బయటపెట్టినా ఇంకా సిగ్గులేకుండా ప్రతిపక్షనేతలు మాట్లాడుతున్నారని మల్లాది
విష్ణు అన్నారు. చంద్రబాబు హయాంలో సింగపూర్, మలేషియా గురించి తప్ప ఏనాడూ ఆంధ్ర
రాష్ట్రం గూర్చి పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. అమరావతి మోజులో పడి విజయవాడ
నగరాన్ని స్మార్ట్ సిటీ కాకుండా తీవ్ర అన్యాయం చేశారని మల్లాది విష్ణు
అన్నారు. వైఎస్సార్ సీపీ అధికారం చేపట్టాక నగరంలో పనులు శరవేగంగా
జరుగుతున్నట్లు వివరించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్
పార్టీదే విజయమని ధీమాను వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు
శ్రీ శైలజా రెడ్డి, కార్పొరేటర్లు శర్వాణి మూర్తి, బాలిగోవింద్, కొంగితల
లక్ష్మీపతి, కొండాయిగుంట మల్లేశ్వరి బలరాం, యరగొర్ల తిరుపతమ్మ, నాయకులు అవుతు
శ్రీనివాసరెడ్డి, అలంపూర్ విజయ్, ఆత్మకూరు సురేష్, ఒగ్గు విక్కీ, బత్తుల
దుర్గారావు, బెవర నారాయణ, ఉమ్మడి వెంకట్రావు, నందెపు సురేష్, దేవిరెడ్డి రమేష్
రెడ్డి, కుక్కల రమేష్, ఉద్దంటి సురేష్, అంగిరేకుల నాగేశ్వరరావు, మోదుగుల
గణేష్, పిల్లి కృష్ణవేణి, మేడేపల్లి ఝాన్సీ, అక్బర్, కురిటి శివ, తోపుల
వరలక్ష్మి, పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.