పాకిస్థాన్ సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గెలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పాక్ 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్ కాసేపు నిలిచిపోవడంతో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం 186 పరుగుల లక్ష్యాన్ని 14 ఓవర్లలో 142 పరుగులకు కుదించారు. అయితే సౌతాఫ్రికా 9 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 69 పరుగులే చేసింది. ఫలితంగా టాపార్డర్ వికెట్లు కోల్పోవడంతో.. అనుకున్న లక్ష్యాన్ని ఛేదించలేక చతికిల పడింది. 14 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 108 పరుగులే చేయగలిగింది. సఫారీ బ్యాటర్లు ట్రిస్టన్ స్టబ్స్(18), క్లాసెన్(15) ప్రయత్నించినప్పటికీ పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి తమ జట్టును విజయాన్ని అందించారు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిదీ 3 వికెట్లు తీయగా.. షాదాబ్ ఖాన్ 2 వికెట్లతో ఆకట్టుకున్నాడు. పాక్ నిర్దేశించిన 186 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఆరంభం నుంచి నిదానంగా ఆడింది. మొదట్లోనే ఓపెనర్ డికాక్ డకౌట్‌గా వెనుదిరిగాడు. అనంతరం కాసేపటికే రిలే రసో తక్కువ పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇలాంటి సమయంలో కెప్టెన్ తెంబా బవుమా, మార్క్‌క్రమ్ నిలకడగా ఆడారు. అయితే ఒకే ఓవర్లో వీరిద్దరిని ఔట్ చేసి పాకిస్థాన్ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు షాదాబ్ ఖాన్. ఆ తర్వాత వర్షం కురిసి మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. చాలా సేపటి వరకు మ్యాచ్ తిరిగి ప్రారంభం కాలేదు. కాసేపటి తర్వాత వర్షం ఆగిపోవడంతో మ్యాచ్‌ను 14 ఓవర్లకు కుదించారు. లక్ష్యాన్ని 142 పరుగులుగా నిర్దేశించారు. అయితే అప్పటికే టాపార్డర్ వికెట్లు కోల్పోయిన సఫారీ జట్టుకు ఆ లక్ష్యం కష్టమైపోయింది.
ఏ దశలోనూ గెలుపు వైపు ప్రయాణించలేదు. చివరకు దక్షిణాఫ్రికా 14 ఓవర్లకు 108 పరుగులుకే పరిమితమైంది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. పాక్ ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్(52) అర్ధశతకంతో విజృంభించగా.. ఇఫ్తికర్ మహమ్మద్(51) కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. వీరిద్దరీ మెరుపులతో పాక్ భారీ స్కోరు చేయగలిగింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో నోర్జే 4 వికెట్లతో రాణించాడు. ఈ విజయంతో పాక్ 4 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకుంది. తన చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై గెలిచినా.. సెమీస్ చేరాలంటే భారత్, దక్షిణాఫ్రికా ఫలితాలపై పాక్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది.