అసెంబ్లీని సమావేశపరచడానికి ఆమోదం తెలపని గవర్నర్
మంత్రివర్గ సిఫారసులు బుట్టదాఖలు చేసిన అనసూయ
అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కొనసాగుతున్న అనిశ్చితి
ఇంఫాల్ : హింస, అల్లర్లతో అట్టుడుకిన మణిపూర్‌లో రాజ్యాంగ సంక్షోభ
పరిస్థితులు తలెత్తుతున్నాయి. హింసాకాండపై చర్చించడానికి అసెంబ్లీని
ప్రత్యేకంగా సమావేశపరచాలని రాష్ట్ర మంత్రివర్గం చేసిన సిఫారసుకు గవర్నర్
అనసూయ యూకీ ఆమోదం తెలుపకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 21న అసెంబ్లీ
ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని బీరేన్‌సింగ్ సర్కారు రెండు సార్లు
విన్నవించినా, గవర్నర్ తోసిపుచ్చినట్టు అధికారవర్గాలు వెల్లడించాయి.
ఇప్పుడున్న పరిస్థితిలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి కేంద్రం సుముఖంగా
లేకపోవటం ఇందుకు కారణమని తెలిసింది. ఈ నేపథ్యంలో రాజ్యాంగ సంక్షోభం తలెత్తే
అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. మంత్రివర్గ ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం
తెలుపకపోవడంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
రాజ్యాంగ వ్యవస్థ కుప్పకూలింది : ‘మణిపూర్‌లో రాజ్యాంగ వ్యవస్థ కుప్పకూలింది.
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఇప్పటికే (ఆగస్టు 21న) మొదలు కావాలి, గవర్నర్
నోటిఫికేషన్ కూడా జారీకాలేదు’ అని కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేశ్ అన్నారు.
అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై జూలై 27, ఆగస్టు 4న బీరేన్ సింగ్ సర్కార్
గవర్నర్‌కు సిఫారసు చేసిందని అధికార వర్గాలు తాజాగా మీడియాకు తెలిపాయి.
ప్రత్యేక సమావేశాల ప్రతిపాదనను కూడా గవర్నర్ తోసిపుచ్చటంతో ఈ అంశం
చర్చనీయాంశమైంది. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 2016లో ఇచ్చిన తీర్పు
ప్రకారం, సభలో మెజార్టీ కలిగిన సీఎం, ఆయన మంత్రివర్గం చేసే సిఫారసు ప్రకారం
అసెంబ్లీ సమావేశానికి గవర్నర్ నోటిఫికేషన్ జారీచేయాల్సి ఉంటుంది.